హైదరాబాద్, ఫిబ్రవరి19(నమస్తేతెలంగాణ) : ‘తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలను ఎలాగైనా గెలువాలని ముఖ్యమంత్రి జారీచేసిన హుకుంతోనే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లిలో సంఖ్యాబలం లేకున్నా మంత్రి వివేక్, ఆయన కుమారుడు అధికారులను బ్లాక్మెయిల్ చేసి రెండుసార్లు చైర్పర్సన్ ఎన్నికను వాయిదా వేయించారని ఆరోపించారు.
ప్రజాతీర్పును కాపాడేందుకు యత్నించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. గతంలో చిలుక పలుకులు పలికిన మేధావులు కాంగ్రెస్ అరాచకపర్వంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను విడిచిపెట్టి రేవంత్‌రెడ్డి క్యాబినెట్ ఢిల్లీలో కూర్చోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు దేనిపై సమీక్ష చేస్తున్నారు.. ముఖ్యమంత్రి పంపుతున్న మూటల లెక్కలపైనా.. లేదంటే కేరళ ఎన్నికలకు పెట్టాల్సిన ఖర్చులపై సమీక్ష చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడుతున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో మెజారిటీ రాకున్నా కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన గద్దెనెక్కిందని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ విమర్శించారు. జనగామలో కాంగ్రె స్ నేతలు అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. సీఎం మెప్పుకోసమే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్ రైతుభరోసా వాడుకుంటున్నారని విమర్శించారు. నాట్లప్పుడు వేయాల్సిన నగదును ఓట్లప్పుడు వేస్తున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ డ్రామాలు ఎంతోకాలం సాగవని తెలిపారు.