Actor Vijay | కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటనపై తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) తొలిసారి స్పందించారు. తన జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. ఈ ఘటన తనను తీవ్ర బాధకు గురి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘నా జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. నా గుండెల నిండా బాధ ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుంది. ప్రచారంలో నన్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. ప్రజల భద్రత విషయంలో నేను రాజీపడను. అందుకే రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు సురక్షితమైన స్థలాన్ని ఎంచుకున్నాను. పోలీసు శాఖను అభ్యర్థించాను. కానీ జరగకూడనిది జరిగింది’ అని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు, కరూర్‌లోనే ఇలాంటి ఘటన ఎందుకు జరిగిందంటూ ప్రశ్నించారు. ‘మేము ఐదు జిల్లాల్లో ప్రచారం చేశాము. కానీ కరూర్‌లోనే ఇలా ఎందుకు జరిగింది..? ఎలా జరిగింది..? ప్రజలకు నిజం ఏంటో తెలుసు. వారు ప్రతీదీ చూస్తున్నారు. త్వరలోనే అన్ని నిజాలూ బయటపడతాయి’ అని అన్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని విజయ్ ఈ సందర్భంగా తెలిపారు. అయినప్పటికీ తమ పార్టీ నాయకులు, స్నేహితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజయ్ కీలక విజ్ఞప్తి చేశారు.
‘సీఎం సార్.. మీరేదైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నాపై తీర్చుకోండి. నన్ను ఏదైనా చేయండి. వాళ్లని (పార్టీ నేతుల, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశిస్తూ) మాత్రం ఏమీ చేయకండి. నేను నా ఇంట్లో లేదా ఆఫీస్‌లోనే ఉంటాను. నన్ను ఏం చేయాలనుకుంటే అది చేయండి’ అంటూ విజయ్ వ్యాఖ్యానించారు. ఘటన జరిగి మూడు రోజులైనా ఇప్పటి వరకూ బాధితులను పరామర్శించకపోవడంపై కూడా విజయ్ స్పందించారు. తానూ ఓ మనిషినేనని.. నేను అక్కడికి వెళ్తే మళ్లీ అలాంటి ఘటనలు జరుగుతాయనే వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read..
Karur Stampede | నేపాల్లోలాగా ఇక్కడ కూడా యువత తిరగబడాలి.. టీవీకే నేత వివాదాస్పద ట్వీట్
Karur stampede | కరూర్ తొక్కిసలాట.. యూట్యూబర్ అరెస్ట్
TVK functionary | టీవీకే కార్యకర్త ఆత్మహత్య.. కరూర్ తొక్కిసలాటకు వాళ్లే బాధ్యులంటూ సూసైడ్ నోట్