అగర్తలా: ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. (BJP And Tipra Motha Workers Clash) పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని నియంత్రించారు. బీజేపీ పాలిత త్రిపురలోని ఖోవాయి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసారం మన్ కీ బాత్ వినేందుకు ఆశారాంబరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక ఇంట్లో సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తలు సమావేశమయ్యారు.
కాగా, త్రిపురలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన మిత్రపక్షం తిప్రా మోథా పార్టీ (టీఎంపీ) కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎనిమిది బైకులు, రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగడంతో పోలీసుల మోహరింపు కొనసాగుతున్నది.
మరోవైపు ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని త్రిపుర సీఎం మాణిక్ సాహా తెలిపారు. పోలీసులు చర్యలు తీసుకుంటారని, అనుమానితులను అరెస్ట్ చేస్తారని చెప్పారు.
కాగా, త్రిపురలో ఎలాంటి రాజకీయ హింస జరుగకూడదని తాము కోరుకుంటున్నామని తిప్రా మోథా వ్యవస్థాపకుడు ప్రద్యోత్ మాణిక్య దేబ్బర్మన్ తెలిపారు. చాలా మంది సీపీఎం మద్దతుదారులు బీజేపీ, మోథాలో ఉన్నారని, ఇలాంటి ఘర్షణల్లో వారు పాల్గొంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అధికార కూటమిలోని బీజేపీ, తిప్రా మోథా పార్టీ మధ్య పెరుగుతున్న విభేదాలకు ఇది నిదర్శనమని రాజకీయ నేతలు భావిస్తున్నారు.
Also Read:
Patients Die | సాంకేతిక లోపంతో తగ్గిన ఆక్సిజన్ సరఫరా.. ముగ్గురు రోగులు మృతి
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు