చండీగఢ్: సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. (Patients Die) ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో జలంధర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా మార్చేటప్పుడు సాంకేతిక లోపం తలెత్తింది. ఆక్సిజన్ ప్రెజర్ పడిపోవడంతో సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆ హాస్పిటల్లో భయాందోళన వాతావరణం ఏర్పడి గందరగోళానికి దారి తీసింది.
కాగా, సాంకేతిక సమస్య వల్ల ఆక్సిజన్ సరఫరా కొద్దిగా తగ్గిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. వెంటనే బ్యాకప్ ఆక్సిజన్ సిలిండర్లను ప్రారంభించడంతోపాటు సాంకేతిక లోపాన్ని కూడా సరిదిద్దినట్లు చెప్పారు. ఇదంతా కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే జరిగిందని అన్నారు. మరణించిన ముగ్గురు రోగుల పరిస్థితి ముందు నుంచే విషమంగా ఉన్నదని తెలిపారు. వేర్వేరు కారణాల వల్ల వారు చనిపోయినట్లు వివరించారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ ఆ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. సాంకేతిక లోపం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గిన అంశంపై కమిటీతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్