TMC : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భంగపాటు ఎదురైంది.అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఇండియా కూటమి 11 అసెంబ్లీ స్ధానాల్లో గెలుపొందగా, బీజేపీ కేవలం 2 స్ధానాలతో సరిపెట్టుకుంది. ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
బెంగాల్లో బీజేపీ నాయకత్వం విఫలమైందని, బెంగాలీలు కాషాయ పార్టీని తిరస్కరించారని, అందుకే వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ఉప ఎన్నికల్లో మీడియా, అధికార యంత్రాంగం, పోలీసులు, ఈసీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయని ఏ ఒక్కరినైనా ఓటు వేయకుండా అడ్డుకున్నట్టు ఒక్క వీడియో అయినా చూపించగలరా అని ఆయన నిలదీశారు.
బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, వారి ఆరోపణలు నిరాధారమని అన్నారు. అధికార దుర్వినియోగానికి సంబంధించి కాషాయ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపుతుందా అని కునాల్ ప్రశ్నించారు. కాగా, ఉప ఎన్నికల్లో ఓటమిని తమ పార్టీ అంగీకరిస్తుందని, ఓటమికి తాము ఈవీఎంలను కానీ, ఎన్నికల కమిషన్ను కానీ నిందించబోమని బీజేపీ నేత షజియ ఇల్మి పేర్కొన్నారు.
విపక్షాలు మాత్రం వివిధ ఎన్నికల్లో ఓటమిపాలైనా ఇప్పటివరకూ తమ ఓటమిని అంగీకరించలేదని, వారు నిత్యం ఈవీఎంలను నిందిస్తారని తాము హుందాగా ఓటమిని అంగీకరించడంతో విపక్షాల డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీయేనని సంవిధాన్ హత్యా దివస్ వెల్లడిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.
Read More :