Sri Sailam | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శని, ఆదివారాలు సెలవు దినాలు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్షేత్రం పరిసరాలన్నీ సందడిగా మారింది. వేకువ జాము నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ కంపార్ట్మెంట్లలో బారులు తీరి దర్శనాలు చేసుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.

మరికొందరు భక్తులు స్వామివారి భక్తులు రుద్రాభిషేకం, కుంకుమార్చన అభిషేకార్చనలు తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో బారులు తీరిన భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం సైతం ఆలయానికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.