బీబీనగర్, ఫిబ్రవరి 27 : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామానికి చెందిన ఏర్పుల కృతికకు దాసన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. స్వర్గీయ వెంకటేష్ కుమార్తె కృతిక ప్రస్తుతం ఘట్కేసర్లోని వివేకానంద జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. తండ్రి మరణంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో రూ.22 వేల ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న దాసన్న ఫౌండేషన్ చైర్మన్, ఉప సర్పంచ్ తంతరపల్లి ప్రదీప్ గౌడ్ వెంటనే స్పందించి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి రూ.11 వేల ఫీజు మొత్తాన్ని ఫౌండేషన్ తరఫున కాలేజీకి చెల్లించారు. దీంతో విద్యార్థినికి ఫీజు రశీదు, హాల్ టికెట్‌ను కాలేజీ యాజమాన్యం అందజేసింది. ఈ సందర్భంగా ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లల విద్యకు దాసన్న ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డుకోకూడదని ఆయన పేర్కొన్నారు.