మంగళవారం 19 జనవరి 2021
National - Dec 27, 2020 , 16:21:47

ప్రజాజీవితంలోకి వచ్చేవారు పీవీ జీవితాన్ని చదువాలి : వెంకయ్యనాయుడు

ప్రజాజీవితంలోకి వచ్చేవారు పీవీ జీవితాన్ని చదువాలి : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన దేశభక్తుల చరిత్రలతోపాటు దేశాభివృద్ధికి పాటుపడిన మహనీయుల జీవితాలను యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావు జీవితంలోని కీలక ఘట్టాల సంకలనంగా పాత్రికేయుడు, కవి, రచయిత కృష్ణారావు రచించిన “విప్లవ తపస్వి-పీవీ” పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించి ప్రసంగించారు.

భారతదేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టారన్న ఉపరాష్ట్రపతి.. మైనారిటీ ప్రభుత్వంలో కొనసాగుతూనే రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ, అయిదేండ్లు అధికారంలో కొనసాగడమే గాక దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారని తెలిపారు. పీవీ అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో దేశంలోని రాజకీయ అస్థిరత, అంతకు ముందు ప్రభుత్వాలు దేశ అవసరాలకు తగినట్టు వేగంగా చర్యలు తీసుకోకపోవడం లాంటివి తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారి తీసాయన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సిన బాధ్యత పీవీ భుజస్కందాల మీద పడిందని, వాటిని ఆయన సమర్థంగా నిర్వహించారని చెప్పారు. 

ఆర్థిక సంస్కరణలు మాత్రమే కాకుండా బలమైన పారిశ్రామిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనన్న ఉపరాష్ట్రపతి.. లైసెన్స్‌రాజ్‌ను రద్దు చేసి ప్రభుత్వానికున్న విచక్షణాధికారాలు తొలగించి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడమే గాక దిగుమతుల విధానాలను సరళం చేశారన్నారు. విదేశీ పెట్టు బడుల బోర్డు, బ్యాంకింగ్ సంస్కరణలు, టెలికామ్ రంగ ఆధునీకరణ, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, కరెన్సీ, క్యాపిటల్ మార్కెట్లకు స్వేచ్ఛ కల్పించడమే కాకుండా విమానయాన రంగంలో ప్రైవేటీకరణ, ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి వంటి వాటి ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి గట్టి పునాదులు వేశారని తెలిపారు. వ్యవసాయ రంగంలో పీవీ చేపట్టిన సంస్కరణలను ప్రస్తావించిన వెంకయ్య.. ఆహారధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తివేసేందుకు కీలక చర్యలు తీసుకుని సేకరణ ధరలు పెరగడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ప్రపంచ ఆర్థిక (డబ్ల్యూటీఓ)లో భారతదేశాన్ని సంస్థాపక దేశంగా చేర్చి, దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేయగల చర్యలకు పీవీ శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. 

దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న పీవీ మాటలను ప్రస్తావించిన వెంకయ్యనాయుడు.. పీవీ నరసింహారావు అనేక మొక్కలు నాటారని.. ఇప్పుడు అవి బలమైన వృక్షాలుగా ఎదుగుతున్నాయన్నారు. పంచాయితీల నుంచి మున్సిపాలిటీల వరకు ఎన్నికలు జరిగేందుకు వీలుగా 73, 74వ రాజ్యాంగ సవరణలు, వీటిలో 33 శాతం రిజర్వేషన్ ద్వారా రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యతను పెంచే చర్యలు సైతం పీవీ హయాంలోనే జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అవకాశాలను ఒడిసి పట్టడం, ప్రాచీన భారత ఆలోచనా విధానం ద్వారా మనిషి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడం గురించి పీవీ గతంలో చెప్పిన అనేక అంశాలను వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. పీవీ జీవితం నుంచి ఉదారవాద భావాన్ని, నిరాడంబరతను యువత అలవరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్న వారు.. పీవీ జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు. బహుభాషా కోవిదుడు, సాహితీ వేత్త, పండితుడు. స్వాతంత్ర్య సమరయోధుడు అయిన పీవీ.. నిజమైన దేశ భక్తుడని, అలాంటి వ్యక్తి తెలుగువారు కావడం జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, పుస్తక రచయిత ఏ కృష్ణారావు, పుస్తక ప్రచురణకర్తలు రాఘవేంద్రరావు, రాఘవ, పాత్రికేయులు ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.