భైంసా టౌన్, ఏప్రిల్ 24 : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండేగాం పునరావాసంపై ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ముంపు గ్రామం ఉందన్న సంగతిని పూర్తిగా మరిచిపోయారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్వేలు నిర్వహించి సమస్యకు పరిష్కారం లభించిందనేలోగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ఎన్నికలు ముగిశాక బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నేతలు గుండేగాం గ్రామాన్ని గురించి ఒక్కసారైనా ఎక్కడా ప్రస్తావించలేదు. పాత సర్వేలు, అవే ప్రతిపాదనలు మళ్లీ మళ్లీ పంపిస్తున్నా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులైతే రావడం లేదు. 2009 నుంచి పునరావాస సమస్యకు పరిష్కారం దొరుకడం లేదు.
వర్షాకాలంలో పరామర్శలు మామూలే..
యేటా వర్షాకాలం ఆరంభంలో భారీ వర్షాలు కురియగానే గుండేగాంలోకి రంగారావు పల్సికర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చొచ్చుకురావడం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు గుండేగాం గ్రామానికి రావడం, పరామర్శించడం పరిపాటిగా మారింది. రాజకీయ పార్టీలు గుండేగాంని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి. సమస్య పరిష్కారానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపి గ్రామస్తులతో ధర్నాలు, రాస్తారోకోలు చేయించి ఎన్నికలు ముగిశాక ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారంలోకి వచ్చాక కూడా పునరావాస సమస్యపై గ్రామస్తులకు భరోసా కల్పించడం లేదు. ఇప్పటికీ పట్టణ సమీపంలో కమలాపూర్ గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో తాత్కాలిక ఆవాసం ఏర్పర్చుకుని తమ వృత్తి అయిన వ్యవసాయానికి దూరమై జీవనం సాగిస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
సర్వేలు, ప్రతిపాదనలకే పరిమితం
పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణంతో గుండేగాం గ్రామం నీట మునిగింది. యేటా వర్షాకాలంలో గ్రామం ముంపునకు గురవుతున్నది. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఊరు మునగదని తేల్చారు. యేటా ప్రాజెక్టు నీటిలో గ్రామం మునిగిపోతున్నది. భారీ వర్షాలు కురిసిన సమయంలో వాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో నీరు నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 162 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించిన 364 ఎకరాల పంట భూములు కూడా నీట మునుగుతున్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా బతుకుతున్న గుండేగాంవాసుల ఇబ్బందులు తీరడం లేదు. ఏళ్లుగా ఈ సమస్య వెంటాడుతున్నా పరిష్కారం దొరకడం లేదు. అధికారులు సర్వేలు చేసి ప్రతిపాదనలు పంపామంటున్నారే తప్పా పరిష్కార మార్గం కనుక్కోవడం లేదు.
కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా?
పునరావాసం కోసం గుండేగాం వాసులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్నారు. కొత్త ప్రభుత్వం తమ ఇబ్బందులను తీరుస్తుందని ఎదురుచూస్తున్నారు. పునరావాసం కల్పిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునరావాస సమస్యను పూర్తిగా మూలకు పడేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
వర్షాకాలం వస్తుందంటే వణుకు పుడుతోంది..
వర్షాకాలంలో మేము పడే బాధలను తలుచుకుంటేనే భయమేస్తుంది. రంగారావు పల్సికర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముందుగా మా ఇంట్లోకే వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అధికారులు సర్వేలు, ప్రతిపాదనల కోసం మా గ్రామానికి వచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా గ్రామాన్ని పట్టించుకునే నాథుడే లేడు. నాయకులందరూ మా గ్రామం పేరిట రాజకీయం చేసి లబ్ధిపొందుతున్నారే తప్పా.. మా గ్రామ పునరావాస సమస్యను పరిష్కరించడం లేదు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చొచ్చుకురావడంతో నిత్యావసరాలు తడిసిపోతున్నాయి.
– పవార్ మిలింద్, గుండేగాం.
వ్యవసాయానికి దూరమైపోతున్నాం..
నాకు తెలిసినప్పటి నుంచి నేను వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నా. గ్రామం నుంచి దూరంగా పట్టణ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో తాత్కాళికంగా ఉంటున్నాం. సొంత ద్విచక్రవాహనం కూడా లేకపోవడంతో ఇక్కడ నుంచి మా గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడానికి తిప్పలు పడుతున్నాం. వర్షాకాలంలో నిల్వ చేసిన నిత్యావసరాలు తడిసి పాడైపోతున్నాయి. దేశానికి అన్నంపెట్టే రైతులైన మేము ఒకపూట తిండి కోసం మానవతావాదులు సరఫరా చేసే నిత్యావసరాలపై ఆధార పడుతున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం గుండేగాం పునరావాస సమస్యను అస్సలు పట్టించుకోవడం లేదు. సర్వేలు, ప్రతిపాదనలు అంటూ కాలయాపన చేయకుండా సమస్యను శాశ్వతంగా, తొందరగా పరిష్కరించాలని కోరుతున్నా.
– పవార్ మోహన్, గుండేగాం.