PM Modi | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మరోసారి కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ (PM Modi) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం (Oath Ceremony) చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో శనివారం రాత్రి 8 గంటలకు మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు.
మరోవైపు ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను (Top South Asian leaders) కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇక శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇప్పటికే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు.
మోదీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు శ్రీలంక అధ్యక్ష కార్యాలయ మీడియా విభాగం తెలిపింది. శనివారం జరగనున్న కార్యక్రమానికి తమ అధ్యక్షుడు విక్రమసింఘే హాజరుకానున్నట్లు తెలిపింది. ఈ మేరకు విజయంపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి నేతల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Also Read..
Nitish Kumar | మోదీ ప్రమాణ స్వీకారం వరకూ ఢిల్లీలోనే నితీశ్ కుమార్..!
AC unit | హౌసింగ్ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం.. ఏసీ యూనిట్ పేలి మంటలు