Nitish Kumar | కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీకి భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్‌ని కూడా దాటలేకపోయింది. దీంతో ఎన్డీయే భాగస్వాముల సహకారం తీసుకుంటే తప్ప ఆ పార్టీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు సాధించిన టీడీపీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) సారధ్యంలోని జేడీయూ మద్దతు తప్పనిసరి. దీంతో వారిద్దరిని కింగ్మేకర్లుగా అంతా అభివర్ణిస్తున్నారు.
అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎన్డీయేలోనే ఉంటామంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేయడంతో ఇప్పుడు అంతా నితీశ్ కుమార్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే నాలుగుసార్లకుపైగా ఎన్డీయే కూటమిలో నుంచి బయటకు వచ్చి మళ్లీ కూటమితో చేతులు కలిపిన నితీశ్ ఈసారి ఏం చేస్తారో అంటూ బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి జాతీయ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది. బుధవారం జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి నితీశ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సాయంత్ర మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇక మోదీ స్వీకారం వరకూ ఆయన అక్కడే ఉండనున్నట్లు ఇండియా టుడే పేర్కొంది. మరోవైపు కొత్త ప్రభుత్వంలో నితీశ్ కుమార్ కీలక మంత్రివర్గం పొందాలను ఆశిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో టీడీపీ సైతం లోక్‌సభలో స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ఇద్దరు నేతలూ పలు డిమాండ్లను మోదీ ముందు ఉంచినట్లు తెలిసింది.
బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు తమ కూటమి నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7న ఎన్డీయే ఎంపీలు సమావేశమై తమ నేతగా మోదీని అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ మేరకు లేఖలు అందించనున్నట్టు హెచ్ఏఎం (సెక్యులర్) నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ సమావేశం తర్వాత తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని జేడీయూ నేత సంజయ్ ఝా వెల్లడించారు.
Also Read..
AC unit | హౌసింగ్ సొసైటీలో భారీ అగ్నిప్రమాదం.. ఏసీ యూనిట్ పేలి మంటలు
Nitin Gadkari | నితిన్ గడ్కరీ ప్రధాని కావాలి.. నాగ్‌పూర్‌లో వెలిసిన హోర్డింగులు