Nitin Gadkari | నాగ్‌పూర్, జూన్ 5: మూడోసారి నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగ్‌పూర్‌లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ఇవి ఏర్పాటు చేశారు. మోదీ సారథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ సాధించని నేపథ్యంలో ఈ హోర్డింగుల పట్ల ప్రాధాన్యం నెలకొన్నది. నాగ్‌పూర్ నుంచి వరుసగా మూడోసారి నితిన్ గడ్కరీ గెలుపొందారు.
ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు గడ్కరీకి శుభాకాంక్షలు చెప్తూనే ఆయన ప్రధాని కావాలని తమ కోరికను ఈ హోర్డింగుల రూపంలో బయటపెట్టారు. మరోవైపు ఇండియా కూటమిలోనూ మహారాష్ట్ర ఫలితాలు కొత్త సమీకరణాలకు తెరతీశాయి. రాష్ట్రంలో 17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకుంది. దీంతో పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని తమ ఆకాంక్షను బయటపెడుతూ ఆయన అనుచరులు కూడా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ కొత్త డిమాండ్ ఇండియా కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.