హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆమె సీఎంకు ఘాటైన లేఖ రాశారు. సీఎంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, జైరామ్ రమేశ్, మీనాక్షీ నటరాజన్‌కు ఆ లేఖను పంపారు.
ఈ నెల 13న మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను విడుదల చేసే కార్యక్రమానికి ఎంఆర్డీసీఎల్ ఎండీ మేధా పాట్కర్‌ను ఆహ్వానించారు. అయితే ఆమె ఇటు ప్రభుత్వానికి, అటు ఎంఆర్డీసీఎల్కు ఊహించని షాక్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవనానికి తాను వ్యతిరేకం కాదని, ప్రజలను హింసిస్తూ.. అభివృద్ధి చేస్తామంటే అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టును సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి పూర్తిగా మినహాయించారని ఎత్తిచూపారు.
ఇప్పటికే ప్రజల అనుమతి లేకుండా 300కు పైగా ఇండ్లను కూల్చి భూములను లాక్కొనేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడం ప్రజాస్వామ్యబద్ధం కాదని విమర్శించారు. మూసీ నది, దాని పరిసర ప్రాంతాల ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఒకరి అభివృద్ధి మరొకరికి నష్టాన్ని కలిగించకూడదని హితవు పలికారు. మహాత్మా గాంధీ పేరుతో ప్రజలను హింసించడం సరికాదని చురకలంటించారు. ప్రజాపాలన అని చెపుకోవడం కాదు.. దాని విలువను నిలబెట్టాలని బుద్ధిచెప్పారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పనలో ప్రజలు, పరీవాహక బస్తీవాసులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ప్రాజెక్టును భాగాలుగా విడగొట్టి ఒక్కో భాగానికి ఒక్కో ప్రణాళిక రూపొందించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని మేధా పాట్కర్ అభ్యంతరం తెలిపారు. డీపీఆర్‌ను ముందుగా ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో విడుదల చేసి కనీసం 60 రోజులపాటు ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. సీఎం ఆధ్వర్యంలో మూసీ ప్రభావిత ప్రజలు, మూసీ జన ఆందోళన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చ జరిపిన తర్వాతనే తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు. ముందుగా అన్ని భూసేకరణ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.
భూసేకరణ, ప్రాజెక్టు రూపకల్పనకు ముందుగా నదీ పరీవాహక ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టును సమగ్రంగా స్టడీ చేసే స్వతంత్ర కమిటీని నియమించి 2013 చట్టంలోని ఉల్లంఘనలు, పర్యావరణ ప్రభావ అంచనాల్లో లోపాలను సవరించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులో ముఖ్యంగా భూసేకరణ నోటీసులు అందుకున్న కుటుంబాలు, పర్యావరణ నిపుణులు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల తరఫున పోరాడుతున్న మూసీ ఆందోళన్, బస్తీ జేఏసీలను భాగస్వామ్యం చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో బాధితులు, నిజమైన ప్రజాస్వామ్యవాదులను చేర్చకుండా ఉన్నత వర్గాలు, కార్పొరేట్ శక్తులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.