Keerthy Suresh | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చర్చనీయాంశంగా మారింది. తాజా ప్రచారం ప్రకారం, ఈ చిత్రంలో ఉండే ఓ హై-వోల్టేజ్ మాస్ స్పెషల్ సాంగ్ కోసం జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ ప్రచారం నిజమైతే నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నేను లోకల్’ మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరాస లోనూ ఈ జంట మరోసారి ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే దర్శకుడు తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ లో కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన పాటలు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ పొందుతున్నాయి. ఒకవేళ కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తే, అనిరుధ్ మాస్ బీట్‌కు ఆమె డ్యాన్స్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ‘నేను శైలజ’ సినిమాతో పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, తర్వాత మహానటి లో సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ వంటి పెద్ద చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా సమానంగా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సరసన తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన్’ చిత్రంతో పాటు, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న వెంకటేష్–కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ చిత్రంలో కూడా ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఈ క్రమంలో ది ప్యారడైజ్ లో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.