పాట్నా: ప్రధాని మోదీ తొలిసారిగా ఇతర పార్టీలపై ఆధారపడాల్సి అవసరం వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది. ఎన్డీయేలోని భాగస్వాముల సహకారం తీసుకుంటే తప్ప ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు సాధించిన టీడీపీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ మద్దతు తప్పనిసరి. దీంతో వారిద్దరిని కింగ్మేకర్లుగా అంతా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) స్పందించారు.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు ఎన్డీయేకు ఉన్నాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం బీహార్‌కు మద్దతుగా ఉండేలా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలన్నారు. ప్రధాని మోదీ మాయాజాలం ఇక ముగిసింది. ఆయన ఇప్పుడు ఎన్డీయే మిత్రపక్షాలపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు.
బీహార్‌లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎన్డీయే, ఇండియా కూటములు రెండు బుధవారం దేశ రాజధానిలో మిత్ర పక్షాలతో సమావేశం నిర్వహించాయి. ఎన్డీయే భేటీకి హాజరయ్యేందుకు నితీశ్, ఇండియా కూటమి భేటీకి వెళ్లేందుకు తేజస్వీ పాట్నా విమానాశ్రయం నుంచి ఒకే విమానంలో బయలుదేరారు. అంతేకాదు, ముందుసీట్లో నితీశ్, ఆయన వెనక సీట్లోనే తేజస్వీ కూర్చోవడం విశేషం. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు ఎన్డీయే కూటమి 12 గెలుచుకుంది. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలను సంపాదించుకోలేకపోయిన బీజేపీకి ఇప్పుడు నితీశ్ కీలక వ్యక్తిగా మారారు. ఇక, ఇండియా కూటమిలో భాగమైన ఆర్జేడీ నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఢిల్లీ వెళ్లేముందు తేజస్వీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో తమకు స్థానాలు పెరిగాయని, కోటికిపైగా ఓట్లు సొంతం చేసుకున్నట్టు చెప్పారు.