HMPV | కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. వైరస్ రోగులతో అక్కడి ఆసుపత్రులు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు రెండు కేసులు వెలుగుచూశాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి సోమవారం ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్ఎంపీవీ వైరస్ అంటే?
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ను(హెచ్ఎంపీవీ) మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.
లక్షణాలు ఏంటి?
హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
ఎలా సోకుతుంది?
దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు.
వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్ సోకుతుంది.
ఎక్కువ ముప్పు ఎవరికి?
పిల్లలు, వయోధికులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్ఎంపీవీ ముప్పు అధికం.
హెచ్ఎంపీవీ ఎలా నివారించాలి?
తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి.
శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు.
అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి.
తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి.
తరచూ కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.
వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు.
అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిది.
హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ ఉందా?
హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు.
Also Read..
“HMPV | బెంగళూరులో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. ధృవీకరించిన ICMR”
“HMPV | భారత్‌లో తొలి హెచ్‌ఎమ్‌పీవీ కేసు.. ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్..!”
“HMPV | చైనాలో మరో మహమ్మారి.. మృతులతో నిండిపోతున్న శ్మశానాలు ?”
“HMPV | హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. అప్రమత్తమైన భారత్”
“HMPV Virus | చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి.. అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్యశాఖ”