HMPV Virus | చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) విస్తరిస్తున్నది. దాంతో పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో జనం చేరుతున్నారు. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ సైతం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్క్ ధరించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఇప్పటి వరకు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని.. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారంతా సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.
కొవిడ్ మహమ్మారి తర్వాత చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(HMPV) కేసులు భారీగా రికార్డువుతన్నాయి. బాధితులతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చైనాలోని 14 ఉత్తర ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. కొవిడ్-19 తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతున్నదా భయాందోళనలు నెలకొన్నాయి. హ్యూమన్ మెటాన్యూమో వైరస్‌ను తొలిసారిగా 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా సమస్యలకు దారి తీస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.
అయితే, హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్‌పై ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ అతుల్ గోయెల్ పేర్కొన్నారు. వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని.. అయితే, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ పట్ల ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ జలుబుకు కారణమయ్యే శ్వాసకోశ వైరస్ మాదిరిగానే హెచ్ఎంపీవీ ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి అయిన డాక్టర్ అతుల్ గోయెల్ పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అయితే సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుందన్నారు. దగ్గు లేదా జలుబు తదితర లక్షణాలు ఉంటే, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. ఆసుపత్రులతోపాటు అత్యవసర వైద్య సామగ్రిని సన్నద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.