HMPV | న్యూఢిల్లీ, జనవరి 3: చైనాలో మరో వైరస్ విజృంభిస్తున్నది. హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు పెరుగుతున్నాయి. బాధితులతో దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా చైనాలోని 14 ఉత్తర ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో కొవిడ్-19 తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతున్నదా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ను(హెచ్ఎంపీవీ) మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.
హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు.
చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్నది.
హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై చైనా స్పందించింది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరగడం సహజమేనని, గతేడాదితో పోల్చితే ఈసారి కేసులు తక్కువగానే ఉన్నాయని శుక్రవారం ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని, చైనాలో ప్రయాణించడం సురక్షితమని ఆమె పేర్కొన్నారు.