Mamata Banerjee : దేశంలో కరోనా (Covid) మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఇవాళ 6 వేలు దాటింది. దాంతో జనం ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) అభయమిచ్చారు.
కరోనా విస్తృతి నేపథ్యంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో తాము సమావేశం నిర్వహించామని మమతాబెనర్జీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా అవగాహనతో, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీతో ఉన్నదని భరోసా ఇచ్చారు.
ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, భయపడాల్సిన పనే లేదని మమతా బెనర్జీ చెప్పారు. కాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు యాక్టివ్ కేసులు పెరుగుతుండటంతో ఇవాళ దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటింది.