Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) వొలోదిమిర్ జెలెన్స్కీ (Volodimir Zelensky) ఎట్టకేలకు తన డ్రెస్సింగ్ స్టయిల్లో మార్పు చేశారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి మిలిటరీ దుస్తుల్లోనే కనిపిస్తున్న ఆయన.. తాజాగా అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో జరిగిన సమావేశానికి బ్లాక్ కలర్ డిజైనర్ సూట్ (Designer suit) లో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సమావేశంలో ఆయన వస్త్రధారణ ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.
ఈ సూట్‌ను ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ విక్టర్ అనిసిమోవ్ (61) రూపొందించారు. అది కేవలం దౌత్యపరమైన సమావేశం కోసమే కాకుండా, శాంతి చర్చలకు ఒక ‘లక్కీ చార్మ్’గా పనిచేస్తుందని డిజైనర్ ఆశాభావం వ్యక్తంచేశారు. జెలెన్స్కీ యుద్ధకాలపు ఇమేజ్‌కు, సాధారణ పౌర శైలిని జోడించే ప్రయత్నం చేశామని అనిసిమోవ్ తెలిపారు.
వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో జెలెన్స్కీ వస్త్రధారణను ట్రంప్ కూడా ప్రశంసించడం గమనార్హం. గత ఫిబ్రవరిలో వీరిద్దరి మధ్య జరిగిన సమావేశం కాస్త ఉద్రిక్తంగా సాగింది. ఆ సమయంలో జెలెన్స్కీ దుస్తులపై ఓ అమెరికన్ జర్నలిస్ట్ చేసిన విమర్శలను అనిసిమోవ్ తీవ్రంగా ఖండించారు. వారు మా జీవన విధానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని నిరాశ కలిగిందని అప్పట్లో వ్యాఖ్యానించారు.
కాగా రష్యాతో యుద్ధం ముగిసే వరకు సూట్ ధరించనని, గడ్డం కూడా గీయనని 2022లో జెలెన్స్కీ ప్రతిజ్ఞ చేశారు. అయినప్పటికీ ఈ కీలక సమావేశం కోసం ప్రత్యేకంగా సూట్ ధరించడం దౌత్య వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు, నాటో సమావేశంలో కూడా జెలెన్స్కీ అనిసిమోవ్ రూపొందించిన దుస్తులనే ధరించారు.