Supreme Court | న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు (Supreme Court)కు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జడ్జిలు తమ ఆస్తుల వివరాలను తాజాగా స్వచ్ఛందంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా 22 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను కోర్టు అధికారి వెబ్సైట్లో పొందుపరిచారు.
ఆ వివరాల ప్రకారం.. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తన బ్యాంకు ఖాతాలో రూ. 55.75 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలో రూ. 1.06 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే, సౌత్ ఢిల్లీలో ఒక త్రీ-బెడ్రూమ్ డీడీఏ ఫ్లాట్ ఉన్నట్లు తెలిపారు. దాన్ని ఆయన తన సోదరుడితో కలిసి కొనుగోలు చేసినట్లు చెప్పారు. తర్వాత 2,000లో దాన్ని ఫ్రీహోల్డ్‌గా మార్చారు.
ఇక కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో రెండు పార్కింగ్ స్థలాలతో కూడిన ఫోర్-బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను 2004లో తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఇంటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో 2019లో కొనుగోలు చేసినట్లు వివరించారు. వీటితోపాటు గురుగ్రామ్‌లోని సెక్టార్ 49లోని సిస్పాల్ విహార్‌లో కుమార్తెతో కలిసి కొనుగోలు చేసిన మరో ఫోర్-బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. ఇందులో జస్టివ్ సంజీవ్ ఖన్నా వాటా 56 శాతం కాగా.. మిగిలిని 44 శాతం ఆయన కుమార్తెది.
ఇక త్వరలో సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) సైతం తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. తన బ్యాంకు ఖాతాలో రూ. 19.63 లక్షలు, పీపీఎఫ్ ఖాతాలో రూ. 6.59 లక్షలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని అమరావతి, నాగ్‌పూర్‌లలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములు, ముంబై, ఢిల్లీలో నివాస అపార్ట్మెంట్లు ఉన్నట్లు వెల్లడించారు. వీరితోపాటు పలువురు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో ఇటీవలే భారీ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడిన అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత సుప్రీం న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిర్ణయించారు. పారదర్శకతతో పాటు ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నింపేందుకు ఈ చర్యకు పూనుకున్నారు. డిక్లరేషన్ ద్వారా ఆస్తులు వివరాలను వెల్లడించేందుకు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకరించారు.
ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తులు వివరాలను వెల్లడించేందుకు జడ్జీలు నిర్ణయించారు. తమ ఆస్తులను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రచురించేందుకు ప్రధాన న్యాయమూర్తితోసహా న్యాయమూర్తులందరూ ఆమోదం తెలిపారు. తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టుకు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించారు. ప్రస్తుతం 22 మంది జడ్జిలు తమ ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు.
కాగా, గత సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది భవిష్యత్తు న్యాయమూర్తులకు కూడా వర్తిస్తుంది. ఇక ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి తమ ఆస్తుల వివరాలు అందచేసేవారు. అది కూడా తప్పనిసరి కాదు. న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమ ఆస్తులను బహిర్గతం చేసేవారు. కాగా, తాజా నిర్ణయానికి సంబంధించిన తీర్మానం ఇంకా కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో మంటలు చెలరేగి కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించటం తీవ్ర కలకలం రేపింది.
Also Read..
Mock Drills | కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 259 చోట్ల సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
Abdul Basit | మే 10-11 తేదీల్లో పాక్‌పై భారత్ దాడులు.. పాక్ దౌత్యవేత్త సంచలన ట్వీట్
Punjab | పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. మందుగుండు సామగ్రి, ఉగ్రవాద హార్డ్వేర్లు స్వాధీనం