Supreme Court | పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ పోస్టుల (Bengal Teachers) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లవని తేల్చిచెప్పింది. అయితే, తొలగింపునకు గురైన కొంత మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు తాజాగా స్వల్ప ఊరట కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకూ వారు విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది. అయితే, ఆరోపణలు లేని ఉపాధ్యాయులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. విద్యార్థులు నష్టపోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మే 31 నాటికి కొత్త నియామకాలు చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court ) ఈ నెల 3న సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు (Calcutta High Court) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. యావత్ నియామక ప్రక్రియ లోపభూయిష్టం, కళంకితమైనదిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. 2024 ఏప్రిల్ 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. నియామకాలను రద్దు చేసిన ధర్మాసనం కొత్త నియామక ప్రక్రియను చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2016లో రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 24,640 ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ రిక్రూట్మెంట్లో అక్రమాలు చోటుచేసుకొన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఉన్న ఖాళీల కంటే అధికంగా 25,753 అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది ఫిర్దౌస్ షమీమ్ పేర్కొన్నారు. ఇక న్యాయస్థానం తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఏప్రిల్ 3 తీర్పు వెలువరించింది.
Also Read..
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
IICMA | ఐస్క్రీంపై జీఎస్టీని తగ్గించండి : ఐఐసీఎమ్ఏ
Naxals Arrest: 22 మంది నక్సల్స్ అరెస్టు, పేలుడు పదార్ధాలు స్వాధీనం