Speaker Om Birla : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనపై స్పీకర్ (Speaker Om Birla) ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ‘సభలో పోస్టర్లు (Posters) ప్రదర్శించవద్దని, నినాదాలు చేయవద్దని మీ సభ్యులకు చెప్పండి’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సభ్యులు ఈ రీతిన పదేపదే ఆందోళనకు దిగడం సభా గౌరవమర్యాదలను తగ్గిస్తుందని స్పీకర్ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు మాట్లాడే అనుమతి ఉండదని, అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలు ప్రతిపక్షాల తీరును గమనిస్తున్నారని హెచ్చరించారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు అంగీకారం తెలిపాయని ఆయన గుర్తుచేశారు.
బీఏసీలో అంగీకారం తెలిపి సభలో చర్చ మొదలుపెట్టకుండా ఎందుకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ ప్రశ్నించారు. ఇలా రోజుల తరబడి సభా కార్యకలాపాలకు అడ్డుపడితే చర్చ ఎలా జరుగుతుందని ఆగ్రహంగా అన్నారు. అనంతరం సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా వేశారు. సభ సజావుగా సాగితే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చను ప్రారంభించే అవకాశం ఉంది.