Eknath Shinde | మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి (Maharashtra CM) ఎవరన్నది ఇంకా తేలలేదు. నాలుగు రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. గత శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఓవైపు బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో తమ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు (Devendra Fadnavis) ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. మరోవైపు.. షిండే నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొందినందున ఏక్నాథ్ షిండే (Eknath Shinde)నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన కార్యకర్తలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సీఎం పదవి దక్కని పక్షంలో షిండే వర్గం ప్లాబ్-బీని సిద్ధం (Plan B Ready) చేసుకున్నట్లు తెలిసింది.
ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేయకపోతే.. హోంశాఖ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. మంగళవారం అర్ధరాత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండే వర్గం నేతలు జరిపిన సమావేశంలో ఈ డిమాండ్‌ను ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. దీంతోపాటు మరికొన్ని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
షిండేకు కేంద్రమంత్రి పదవి?
రెండు రోజుల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి వస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసి ఏక్నాథ్ షిండేను కేంద్రమంత్రిగా, ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండేను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. మరొక ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఫార్ములా ద్వారా మూడు పార్టీలనూ ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అంటున్నారు. ఇది షిండే గౌరవాన్ని తక్కువ చేయదని, ఈ విషయం తేలికగా పరిష్కారమవుతుందని బీజేపీ భావిస్తున్నది. అయితే షిండే ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారని కూడా చెబుతున్నారు.
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ షిండేను కోరారు.
Also Read..
Adani issue | అదానీ అంశంపై పార్లమెంట్లో రచ్చ.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా
Naga Chaitanya – Sobhita | నయన్ బాటలో నాగచైతన్య-శోభిత.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న టీమ్
Air Pollution | ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం.. రాజధానిని కమ్మేసిన పొగమంచు