సోమవారం 18 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:54:59

టీకా రవాణా షురూ

టీకా రవాణా షురూ

  • మొదలైన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సరఫరా
  • పుణె నుంచి 13 నగరాలకు చేరవేత
  • తొలి రోజు 56.5 లక్షల డోసులు పంపిణీ
  • 16 నుంచి వ్యాక్సినేషన్‌
  • 16.5 లక్షల డోసులను ఉచితంగా  అందిస్తున్న భారత్‌ బయోటెక్‌

న్యూఢిల్లీ/పుణె, జనవరి 12: దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో మొదలుకానున్న మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) మంగళవారం వ్యాక్సిన్‌ రవాణా ప్రక్రియను ప్రారంభించింది. పుణేలోని ఆ సంస్థ తయారీ కేంద్రం నుంచి తొలి రోజు మొత్తం 56.5 లక్షల డోసులను హైదరాబాద్‌ సహా 13 నగరాలకు చేరవేశారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక పూజ అనంతరం మూడు ట్రక్కుల్లో టీకాలను సీరం సంస్థ నుంచి పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి విమానాల్లో వివిధ నగరాలకు పంపించారు. స్పైస్‌జెట్‌, ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో విమానయాన సంస్థలకు చెందిన తొమ్మిది విమానాలు ఈ రవాణాలో పాలుపంచుకున్నాయి. తొలి విమానం పుణే నుంచి ఢిల్లీకి ఉదయం 10 గంటలకు చేరుకున్నది. మరోవైపు మూడు ట్రక్కుల్లో ముంబైకి వ్యాక్సిన్లను తరలించారు. అక్కడి నుంచి బుధవారం దేశంలోని 27 ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. 

టీకాను ఎంపిక చేసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లలో ఏ వ్యాక్సిన్‌ వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదని కేంద్రం సంకేతాలిచ్చింది. ‘ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతున్నది. అయితే ఏ టీకా వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఏ దేశమూ కల్పించలేదు’ అని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  ప్రభుత్వం ఆర్డర్‌ చేసిన మొత్తం డోసులు (సీరం నుంచి 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ నుంచి 55 లక్షల డోసుల కొవాగ్జిన్‌) గురువారం నాటికి అందుతాయని తెలిపారు. భారత్‌ బయోటెక్‌కు ఆర్డర్‌ ఇచ్చిన 55 లక్షల డోసుల్లో 16.5 లక్షలను ఆ సంస్థ ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. మిగిలిన 38.5 లక్షల డోసులను ఒక్కో డోసుకు రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం కొవాగ్జిన్‌ టీకాలు కూడా డిస్పాచ్‌ కానున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

చారిత్రక ఘట్టం: ఎస్‌ఐఐ

ప్రస్తుతం దేశంలో 1.11 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నామని సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. ఫిబ్రవరినాటికి 5-6 కోట్ల డోసులను అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. సోమవారం సీరం నుంచి దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు టీకా పంపిణీ మొదలైందని, ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇతర భాగస్వామ్య పక్షాల శ్రమ ఫలితంగానే ఏడాదిలోపునే టీకా సాధ్యమైందని తెలిపారు. భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా రూ.200కే ఒక్కో డోసు వ్యాక్సిన్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్‌ మార్కెట్‌లో దీని ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపారు.