Bihar Elections | రెండో దశ పోలింగ్‌కు (Bihar Elections) బీహార్ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ఈనెల 6న నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పోలింగ్ (Second Phase Elections) నవంబర్ 11 మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. పోలింగ్ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు (Security tightened). దాదాపు 4 లక్షలకుపైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
243 అసెంబ్లీ స్థానాలకు గానూ 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా.. రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది (దాదాపు 10 శాతం) మహిళలే. రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్‌లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి.
బీజేపీకి సంప్రదాయకంగా తిర్హుత్, సారణ్, ఉత్తర మిథిలాంచల్ ప్రాంతాలలో గట్టి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు భాగల్పూర్ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. ఇక విపక్ష మహాఘట్బంధన్కు మగధ్ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలో గయ, ఔరంగాబాద్, నావడ, జెహనాబాద్, అర్వాల్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏమాత్రం పలుకుబడి లేని కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాల బలంపైనే ఆధారపడింది.ఇక రెండు దశలకు కలిపి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read..
SpiceJet | ఇంజిన్‌లో సాంకేతిక సమస్య.. స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
Water Tank | కూలిన 1.38 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్.. నివాసాలను ముంచెత్తిన వరద
Air Pollution | ఢిల్లీలో అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. నగరాన్ని కప్పేసిన పొగమంచు