Water Tank | సాధారణంగా భారీ వర్షం కురిస్తే వరద రావడం మనం చూస్తుంటాం.. అయితే, వాన పడకపోయినా.. జనావాసాలను నీరు ముంచెత్తడం ఎప్పుడైనా చూశారా..? తాజాగా కేరళ రాష్ట్రంలో అదే జరిగింది. ఓ వాటర్ ట్యాంక్ (Water Tank) కుప్పకూలడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో (Houses Flooded) స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన కేరళ కొచ్చిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొచ్చిలోని తమ్మనం (Thammanam) ప్రాంతంలోగల కుతప్పడి ఆలయానికి (Kuthappady Temple) సమీపంలో ఉన్న 1.38 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంక్ కుప్పకూలిపోయింది. కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొంత భాగం కూలిపోవడం (Water Tank Collapses in Kochi)తో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అనేక ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న స్థానికులు ఆ శబ్దానికి లేచి చూడగా.. అప్పటికే వరద మొత్తం చుట్టుముట్టింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు వరద ప్రవాహంలో కొట్టుకునిపోయాయి. వరద ప్రవాహానికి బురద, రాళ్లు ఇళ్లలోకి కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. కొందరు స్థానికులు తమ ఇంట్లోకి వచ్చిన నీటిని బకెట్ల సాయంతో రోడ్డుపై పారబోశారు. వరద తమ్మనంలోని కొచ్చి కార్పొరేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ముంచెత్తింది. దీంతో అందులో నిల్వ ఉంచిన మందులు, వైద్య పరికరాలు, కంప్యూటర్లు దెబ్బతిన్నట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా, ఈ ట్యాంక్ 40 ఏళ్ల క్రితం నిర్మించినదని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ట్యాంక్ నుంచి కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని వెల్లడించారు. మరోవైపు అధికారులు ట్యాంక్ కూలడంతో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు చేపట్టారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో అత్యంత దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. నగరాన్ని కప్పేసిన పొగమంచు
Bengaluru Airport: బెంగుళూరు విమానాశ్రయంలో నమాజ్ .. కర్నాటక ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ
Online Investment Scam: డేటింగ్ యాప్‌తో పరిచయం.. ఆన్లైన్ స్కామ్.. 1.29 కోట్లు కోల్పోయిన వ్యక్తి