బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి సుమారు 1.29 కోట్లు కోల్పోయాడు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్(Online Investment Scam)కు బలయ్యాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులతో అతను మోసపోయాడు. సైబర్ క్రైం పోలీసులు ఈ ఘటనలో కేసు నమోదు చేశారు.
నవంబర్ 7వ తేదీన ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా బాధితుడు సీ జగదీశ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్లు అతని నమ్మకాన్ని గెలిచారు. స్టాక్ మార్కెట్ వెబ్సైట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అతన్ని నమ్మించారు.
నేరానికి పాల్పడిన నిందితురాలిని మేఘనా రెడ్డిగా గుర్తించారు. తండ్రి పేరుమీద ఓల్డేజ్ హోం కట్టిస్తామని చెప్పి బాధితుడి నుంచి ఆమె డబ్బులు లాగేసింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా నవంబర్ 5, 6 తేదీల్లో బాధితుడు రూ.1.29 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు.
డబ్బు ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత ఎటువంటి రిటర్న్స్ రాలేదు. మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ఐటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో దర్యాప్తు జరుగుతున్నదని, అమౌంట్ రికవరీ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.