Pariksha Pe Charcha | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10వ తేదీన పరీక్ష పే చర్చ జరగనుంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఈ సారి పరీక్షా పే చర్చ కార్యక్రమం చాలా స్పెషల్ కానుంది. ఎందుకంటే ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారు.
బాలీవుడ్ నటీనటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొననున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru), బాలీవుడ్ సెలబ్రిటీలు దీపికా పదుకొణె (Deepika Padukone), విక్రాంత్ మస్సే, భూమి పడ్నేకర్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్, పారా అథ్లెట్ అవని లేఖరా, రచయిత రుజుతా దివేకర్, ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలీ సబర్వాల్, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌధరీ, ఫుడ్ ఫార్మర్ రేవంత్ హిమత్సింగ్కా వంటి ప్రముఖులు పాల్గొని బోర్డు పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు చిట్కాలు అందజేస్తారు. తమ అనుభవాలను కూడా విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపనున్నారు.
కాగా, పరీక్షా పే చర్చ 2025 కోసం గతేడాది డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 24 ఉదయం 10 గంటల వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 6 నుంచి 12వ తరగతి చదివే సుమారు 2,500 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరంతా ప్రధానితో జరిగే చర్చా కార్యక్రమంలో నేరుగా పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానాలిస్తారు. వారికి పలు సూచనలు కూడా చేస్తారు. ఇక కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులందరికీ పీపీసీ కిట్స్‌ను కేంద్ర విద్యా శాఖ అందించనుంది.
Also Read..
Argentina | ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్జెంటీనా ఔట్
Bangladesh | బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. బంగబంధు ఇంటికి నిప్పు
Gold Seized | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత