Nitin Gadkari | కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు (road accident victims) నగదు రహిత చికిత్సను (cashless treatment) అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాను అందిస్తామని గడ్కరీ తెలిపారు.
పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి గడ్కరీ మంగళవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారని.. అందులో 30 వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మరణించినట్లు తెలిపారు. మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సుగల వారే ఉండటం బాధాకర విషయమన్నారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తప్పుల వల్ల 10,000 మంది పిల్లలు చనిపోయారని గడ్కరీ వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపడం వల్ల మూడు వేల మంది మరణించినట్లు తెలిపారు.
Also Read..
OnePlus 13 | భారత్లో వన్ప్లస్ 13 సిరీస్ ఫోన్లు లాంచ్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Elon Musk | ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి.. జనాభా తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఆందోళన
Justin Trudeau | అమెరికాలో విలీనమవడం అసాధ్యం.. ట్రంప్ ప్రతిపాదనపై ఘాటుగా స్పందించిన ట్రూడో