Justin Trudeau | కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలనే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదనపై జస్టిన్ ట్రూడో (Justin Trudeau) స్పందించారు. ఈ మేరకు ట్రంప్ సూచనను ట్రూడో ఘాటుగా తిరస్కరించారు. యూఎస్‌లో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇది అసాధ్యమని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘కెనడా యునైటెడ్ స్టేట్స్లో భాగమయ్యే అవకాశమే లేదు. అమెరికా, కెనడా రెండు దేశాల్లోని ప్రజలు, కార్మికులు వాణిజ్యం, సెక్యూరిటీ భాగస్వామ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారు’ అని ట్రూడో తన ట్వీట్లో రాసుకొచ్చారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రూడోకు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఇక ఇంతలో కెనడా పధాని ట్రూడో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన తర్వాత ట్రంప్ మరోసారి కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలో చాలా మంది ప్రజలకు ఇష్టమేనని వ్యాఖ్యానించారు. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి తమ దేశం ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయం కెనడా ప్రధాని ట్రూడోకు తెలుసు కాబట్టే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాలో విలీనమైతే దిగుమతి సుంకాలు ఉండవని, పన్నులు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా రష్యా, చైనాలకు చెందిన నౌకల నుంచి ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ ప్రతిపాదనపై ట్రూడో పై విధంగా స్పందించారు.
Also Read..
Donald Trump | ట్రూడో రాజీనామా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Canada PM | కెనడా తదుపరి ప్రధాని ఎవరు..? రేసులో భారత సంతతి ఎంపీ
Canada PM Justin Trudeau | కెనడా ప్రధానిగా ట్రూడో రాజీనామా..!