Canada PM | కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని వెల్లడించారు.
ట్రూడో నిర్ణయంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. లిబరల్ పార్టీ (Liberal Party) నేతలు క్రిస్టియా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్తోపాటు భారత సంతతి ఎంపీ (Indian origin MP) అనిత ఆనంద్ (Anita Anand) పేర్లు వినిపిస్తున్నాయి.
Anita Anand
భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్.. తమిళ్, పంజాబీ మూలాలు కలిగిన నేత. ఆమె తండ్రిది తమిళనాడు కాగా, తల్లిది పంజాబ్. 57 ఏళ్ల అనిత ఆనంద్ ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్విల్లే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె ట్రూడో కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. పబ్లిక్ సర్వీసెస్, రవాణా, రక్షణ సహా పలు కీలక పదవులను చేపట్టారు.
కాగా, సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద ట్రూడో మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
‘నేను ఏ పోరాటం నుంచి అంత సులువుగా వెనక్కు తగ్గను. కానీ, కెనడియన్ల ప్రయోజనాలు, నేను ప్రేమించే ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజీనామా చేస్తున్నాను’ అని ట్రూడో వ్యాఖ్యానించారు. కెనడాలో అధికార పార్టీ అధినేత రాజీనామా తర్వాత కొత్త నాయకుడి ఎన్నికకు 90 రోజుల గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రూడో పాలనకు మరో 90 రోజుల్లోపే తెరపడనుంది.
Also Read..
Canada PM Justin Trudeau | కెనడా ప్రధానిగా ట్రూడో రాజీనామా..!
Justin Trudeau | కెనడా ప్రధాని సంచలన నిర్ణయం.. రాజీనామా యోచనలో ట్రూడో..!