Donald Trump | కెనడా ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) రాజీనామా ప్రకటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలో చాలా మంది ప్రజలకు ఇష్టమేనని వ్యాఖ్యానించారు. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి తమ దేశం ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయం కెనడా ప్రధాని ట్రూడోకు తెలుసు కాబట్టే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాలో విలీనమైతే దిగుమతి సుంకాలు ఉండవని, పన్నులు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా రష్యా, చైనాలకు చెందిన నౌకల నుంచి ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రూడోకు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఇదిలా ఉండగా.. కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని (Canada PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని వెల్లడించారు.
ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘నేను ఏ పోరాటం నుంచి అంత సులువుగా వెనక్కు తగ్గను. కానీ, కెనడియన్ల ప్రయోజనాలు, నేను ప్రేమించే ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజీనామా చేస్తున్నాను’ అని ట్రూడో వ్యాఖ్యానించారు. కెనడాలో అధికార పార్టీ అధినేత రాజీనామా తర్వాత కొత్త నాయకుడి ఎన్నికకు 90 రోజుల గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రూడో పాలనకు మరో 90 రోజుల్లోపే తెరపడనుంది.
Also Read..
Canada PM | కెనడా తదుపరి ప్రధాని ఎవరు..? రేసులో భారత సంతతి ఎంపీ
Canada PM Justin Trudeau | కెనడా ప్రధానిగా ట్రూడో రాజీనామా..!
Justin Trudeau | కెనడా ప్రధాని సంచలన నిర్ణయం.. రాజీనామా యోచనలో ట్రూడో..!