సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 15:45:25

ఈ అంధ ఐఏఎస్‌.. మార్గదర్శకుడు

ఈ అంధ ఐఏఎస్‌.. మార్గదర్శకుడు

బొకారో : రాజేశ్‌ కుమార్‌ సింగ్‌.. క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. ఆరేండ్ల వయసులో ఒకరోజు క్రికెట్‌ ఆడుతూ బంతిని క్యాచ్‌ పట్టబోయి సమీపంలోని బావిలో పడిపోయాడు. దాంతో తలకు తీవ్ర గాయాలై రాజేశ్‌ కుమార్‌ సింగ్‌కు కంటి చూపు పోయింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో శ్రమించి ఇండియన్‌ క్రికెట్‌ జట్టుకు ఎంపికై విశేష సేవలందించారు. 1998, 2002, 2006 లో మూడుసార్లు ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొని మన దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు.

చిన్ననాటి నుంచి పెట్టుకున్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. 2007 లో సివిల్స్ పాసయ్యారు. అయితే అంధుడైనందున రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ అభ్యర్థిత్వాన్ని పరిశీలనకు తీసుకోమంటూ యూపీఎస్సీ కరాఖండిగా చెప్పడంతో.. ఆయన కోర్టు మెట్లెక్కాడు. మూడేండ్లపాటు కోర్టులో పోట్లాడి తుదకు విజయం సాధించారు. ఆయనకు తొలుత అసోం క్యాడర్‌ ఇచ్చిన అధికారులు.. అనంతరం జార్ఖండ్‌ క్యాడర్‌కు పంపారు. శిక్షణ అనంతరం జార్ఖండ్‌కు వెళ్లగా ఆయనకు విధులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. దాంతో ఆయన సచివాలయానికే పరిమతమై పోయారు. తుదకు జార్ఖండ్ ప్రభుత్వం ఆయనను బొకారో నగర డిప్యూటీ కమిషనర్‌గా నియమించింది. కేవలం పది శాతం కంటిచూపుతో పనులు నిర్విఘ్నంగా జరుపుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎలాంటి తడబాటు లేకుండా దూసుకుపోతున్నారు.

రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ మంచి రచయిత కూడా. ఇప్పటివరకు పలు పుస్తకాలను రచించారు. తొలిపుస్తకంగా 'పుట్టింగ్ ది ఐ ఇన్‌ ఐఏఎస్‌' రాసి ఎందరిలోనే ఉత్సాహం నింపారు. ఇదే పుస్తకాన్ని హిందీలో కూడా అనువాదం చేసి ముద్రించారు. ప్రస్తుతం నీటి సంరక్షణపై మరో పుస్తకాన్ని రాస్తున్నారు. ఈయన పుస్తకాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతాయి. ఎప్పుడైనా నిరాశకు గురైతే.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి రాసిన ' ఐ విల్‌ నాట్‌ గివ్‌ అప్‌, ఐ విల్‌ నాట్‌ రైట్ ఏ సాంగ్‌ ఆన్‌ ది స్కల్ ఆఫ్‌ ది టైమ్‌.. ఐ విల్‌ రైట్‌ ఏ న్యూ సాంగ్‌' అనే పద్యం పాడుకుంటానంటున్నారు రాజేశ్ కుమార్ సింగ్. అంధుడైనప్పటికీ ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఉన్నతస్థాయి అధికారిగా విధులు నిర్వర్తిస్తూ యువతలో స్ఫూర్తినింపుతున్నారు.


logo