Rahul Gandhi | భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. భాషలు, సంప్రదాయాల ఆధారంగా ప్రజలను విడదీయరాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడ డాల్లాస్‌లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగు భాష (telugu language) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి ఉన్నాయన్నారు.
‘మన జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను సమానంగా ప్రతిబింబిస్తుంది. ఒక రాష్ట్రం బెస్ట్ అని, మరొక రాష్ట్రం సెకండ్ బెస్ట్ అని ఎక్కడా ఉండదు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుందని ఈ గీతం స్పష్టంగా చెబుతుంది. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. తమిళం మాట్లాడేవారు మాకు నచ్చరని.. హిందీ మాట్లాడేవారు ఇష్టమని చెప్పడం సరికాదు. ఉదాహరణకు తెలుగు భాషను తీసుకోండి.. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు.. అది ఓ చరిత్ర, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోలుస్తూ, తెలుగు భాష అంత ముఖ్యం కాదని చెప్పినట్లయితే అది ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులు ముఖ్యం కాదని మీరు చెప్పినట్లే..!’ అని రాహుల్ వివరించారు. విదేశీ గడ్డపై రాహుల్ తెగులు భాషను ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక తన యూఎస్ పర్యటనలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత్ అంటే ఒకే ఆలోచన అని ఆర్ఎస్ఎస్ (RSS) నమ్ముతోందని వ్యాఖ్యానించారు. కానీ, భారత్ అంటే బహుళ ఆలోచనలు అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అగ్రరాజ్యం అమెరికాలో లానే అందరికీ ప్రాతినిథ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. కులం, మతం, భాష, సంప్రదాయం, చరిత్రతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలు కనేందుకు అర్హులే అని అన్నారు. కానీ, భారత్‌లో ఇప్పుడు ఆ పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తోందని తెలిపారు. భారత ప్రధాన మంత్రి రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం మొన్నటి ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైందని వ్యాఖ్యానించారు.
రాజకీయ నాయకులు కుల మతాలకు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. కానీ భారత రాజకీయ వ్యవస్థలో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవన్నారు. ‘భారత రాజకీయ వ్యవస్థల్లో, పార్టీల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని నేను భావిస్తున్నాను. కులమతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి. అత్యంత శక్తివంతమైన వ్యక్తులను మాత్రమేకాదు, భారతదేశాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.
Also Read..
Prakasham Barrage | ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలవే.. చంద్రబాబుకు అధికారుల నివేదిక
Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘నాటు నాటు’ పాట.. దేశీ టచ్‌తో దూసుకెళ్తున్న కమలా హారిస్
Bajrang Punia | కాంగ్రెస్‌లో చేరిన రోజుల వ్యవధిలోనే.. బజరంగ్ పునియాకు బెదిరింపులు