Prakasham Barrage | భారీ వరదలు వచ్చిన సమయంలో ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బ్యారేజి గేట్లను ఢీకొట్టిన బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవే అని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు.
ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టిన బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులవేనని అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని తెలిపారు. సహజంగా మూడింటిని కలిపి కట్టరని ఆ నివేదికలో చెప్పారు. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేశారని వివరించారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని పేర్కొన్నారు.
ఒక్కోటి 40-50 టన్నుల బరువు ఉన్న బోట్లు ఢీకొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.