Bajrang Punia | భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు (Bajrang Punia) బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల క్రితం పునియా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హస్తం పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే ఆయనకు వాట్సాప్ ద్వారా బెదిరింపులు (Threat Message) వచ్చాయి. ఈ వ్యవహారంపై బజరంగ్ పునియా సోనిపట్‌లోని బహల్‌ఘర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్టార్ రెజ్లర్లకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే నెల జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ఇద్దరూ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిక నేపథ్యంలో ఇద్దరు రెజ్లర్లూ రైల్వేస్‌లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Sam Pitroda | రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు.. : శామ్ పిట్రోడా
Rahul Gandhi | భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం వంటివి లేవు : రాహుల్ గాంధీ
CV Anand | హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్