Wayanad Landslide : వయనాద్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను, స్ధానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాధితులను కలిసి వారితో రోజంతా గడిపామని, ఇది మాటలకు అందని మహా విషాదమని చెప్పారు. ప్రజల బాధలను చూసి చలించిపోయామని, ఇక్కడి పరిస్ధితి చూస్తుంటే వారెంతగా నలిగిపోయారో మనం ఊహించవచ్చని వ్యాఖ్యానించారు.
బాధితులకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చేందుకే తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ విపత్తు సంభవించిందని అన్నారు. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను ఎలా ఆదుకోవాలనే దానిపై తాము శుక్రవారం కూలంకషంగా చర్చిస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇక కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 288కి చేరుకుంది.
అయితే ప్రమాదానికి కేంద్ర స్థానమైన చూర్మలాలో అంతకుముందు గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాధితులను కలుసుకున్నారు. అక్కడ నుంచి డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన రెండు రిలీఫ్ క్యాంప్‌లను సందర్శించి బాధితులను పరామర్శించారు. రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
Read More :
Kriti Sanan | తన కంటే 7 ఏండ్లు చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న కృతిసనన్.?