Loksabha Elections 2024 : యూపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. ప్రధాని ఏమైనా జ్యోతిష్యులా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తాము లోక్‌సభ ఎన్నికల్లో 400 స్ధానాలకు పైగా సాధించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదని, యూపీలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని ప్రధాని మోదీ అంతకుముందు వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఏ పార్టీ ఏం చేసిందనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తామేం చేశామో కాషాయ పాలకులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపై కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనేది అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈ విషయాలను ప్రజలు బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలకు ప్రియాంక గాంధీ పిలుపు ఇచ్చారు.
రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడేవారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ కంచుకోటలు రాయ్‌బరేలి, అమేథిల నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ, కిషోరి లాల్ శర్మ ఘనవిజయం సాధిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రెండు స్ధానాల్లో బీజేపీ అభ్యర్ధులు దినేష్ ప్రతాప్ సింగ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలకు భంగపాటు తప్పదని అన్నారు.
Read More :
Double iSmart Teaser | రామ్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ లోడింగ్ గురూ.. రన్ టైం ఎంతంటే..?