శనివారం 16 జనవరి 2021
National - Dec 27, 2020 , 01:23:49

గురువింద నీతులు!

గురువింద నీతులు!

  • ప్రజాస్వామ్యం గురించి ఢిల్లీలో కొందరు లెక్చర్లు ఇస్తున్నారు
  • రాహుల్‌గాంధీ విమర్శలపై ప్రధాని నరేంద్రమోదీ విసుర్లు

న్యూఢిల్లీ: కోర్టులు మొట్టికాయలు వేసినా తాము అధికారంలో ఉన్న చోట ఎన్నికలు నిర్వహించకుండా మొండికేసిన కొన్ని పార్టీల నేతలు ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందన్న కాంగ్రెన్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శలపై ప్రధాని సెటైర్లు వేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ప్రారంభించి ప్రసంగించారు. ‘ఢిల్లీలో నన్ను నిత్యం అవమానించేవాళ్లు కొందరు ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి కౌన్సిల్‌ (డీడీసీ) ఎన్నికలనే వారికి ఉదాహరణగా చూపించదల్చుకున్నాను. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పుదుచ్చేరిలో సుప్రీంకోర్టు ఆదేశించినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. కానీ జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన ఏడాదిలోపే ఎన్నికలు నిర్వహించి చూపించాం’ అని పేర్కొన్నారు.   

కూలీ ఇచ్చిన వస్ర్తాలు ధరించిన ప్రధాని

జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ వ్యవసాయ కూలీ గతేడాది బహుమతిగా ఇచ్చిన కశ్మీరీ సంప్రదాయ వస్ర్తాల (ఫెరన్‌)ను ప్రధాని మోదీ మురిపెంగా ధరించారు.