PM Modi | గతంలో రూ.100తో మార్కెట్‌కు వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు కిలో ఉల్లిగడ్డలు కూడా వస్తలే!
– ఓ గృహిణి నిట్టూర్పు
బండిలో పెట్రోల్‌కు గతంలో నెలకు రూ.1,000 అయ్యేది. ఇప్పుడు, రూ.4 వేలైనా సరిపోవట్లే!
– ఓ ఉద్యోగి మండిపాటు
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడికి ప్రస్తుతం పస్తులు ఉండే దుస్థితి దాపురించింది. సర్కారు అసమర్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో పేద, మధ్యతరగతి వారిపై ఏదొక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పెంపుతో ప్రజలు అల్లాడుతుంటే.. పెరిగిన నిత్యావసరాల ధరలు వారికి మరింత పెనుభారంగా మారాయి.
బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, ఆలుగడ్డ, చింతపండు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవలి వరకు టమోటా ధరల ‘మోత’ మోగగా, ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడింది. తద్వారా ఆ ప్రభావంతో సరుకుల ధరలు నింగినంటాయి. మరోవైపు మోదీ ముందుచూపులేని విధానాలతో అంతర్జాతీయంగా రూపాయి అథఃపాతాళానికి చేరుకొన్నది. దీని ప్రభావం దిగుమతులపై పడి అంతిమంగా అది నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరేలా చేసింది.
200 శాతం పెరుగుదల
కిలో ఉల్లి మొన్నటి వరకూ రూ.20కే లభించగా.. ప్రస్తుతం కిలో రూ.80-100 పలుకుతున్నది. పచ్చిమిర్చి, క్యాప్సికం, బీన్స్ తదితర కూరగాయల ధరలు ఉల్లితో పోటీపడి పరుగులు తీస్తున్నాయి. అల్లం, ధనియాలు, పచ్చి బఠానీల ధరలు రెట్టింపయ్యాయి. రూ.400కి చేరిన ఎండు మిరపకాయల ధరలు తినకముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని సామాన్యులు వాపోతున్నారు. మొత్తంగా గడిచిన 3-4 నెలల్లోనే వివిధ కూరగాయలు, నిత్యావసరాల ధరలు 10 నుంచి 200 శాతం వరకు పెరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఆజ్యం పోస్తున్న రూపాయి పతనం
2014లో మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి నిత్యావసరాల ధరలు సుమారు 300 శాతం పెరిగినట్టు లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు 30 శాతం వరకు పెరిగినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, ఆ లాభాన్ని వినియోగదారుడికి అందకుండా బీజేపీ సర్కారు ఖజానాకు మళ్లించింది.
గడిచిన ఎనిమిదేండ్లలో మోదీ సర్కారు డీజిల్‌పై 512 శాతం, పెట్రోల్‌పై 194 శాతం ఎక్సైజ్ పన్నులను పెంచినట్టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) నివేదిక వెల్లడించింది. ఒకవైపు రూపాయి పతనం, మరోవైపు చమురు ధరల పెంపు, కేంద్రం సుంకాలను తగ్గించకపోవడం వెరసి.. నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
తొమ్మిదిన్నరేండ్లలో ధరల భారం పెరిగిందిలా..
డీజిల్ పెంపు (77%), వ్యవసాయ/కూరగాయల పెట్టుబడి ఖర్చులో పెరుగుదల (45%), ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల (58%), రవాణా వ్యయంలో పెరుగుదల (30%), హోల్‌సేల్ వ్యాపారి వ్యయంలో పెరుగుదల (42%), రిటైల్ వ్యాపారి వ్యయంలో పెరుగుదల (48%), వినియోగదారుడిపై మొత్తంగా పడే భారం (300%)