న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన అంగరక్షకులు మొదలుకుని ఆయన వెంట వచ్చే సంచార ఫుడ్ ల్యాబొరేటరీల వరకు, చివరకు ఆయన మలమూత్రాలను సైతం భద్రపరిచి కంటెయినర్లలో తిరిగి రష్యాకు తీసుకువెళ్లడం వంటివన్నీ పుతిన్ భద్రతా వ్యవస్థ శత్రు దుర్భేద్య కోటను తలపిస్తుంది. ఆయన ప్రయాణించే కారు, విమానం సైతం అత్యంత భద్రత కలిగి ఉంటాయి.
పుతిన్ తన విదేశీ పర్యటనలో ఉపయోగించే ఆరస్ సెనాత్ కారు మాస్కో నుంచి రవాణా అవుతుంది. చక్రాలపై నడిచే కోటగా వర్ణించే ఈ లగ్జరీ కారుకు బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ ఉంది. ఎటువంటి వాతావరణంలోనైనా ఆగకుండా పనిచేయగల సామర్థ్యం దీని ఇంజన్‌కు ఉంది. బాంబు పేలుళ్లను సైతం తట్టుకునే విధంగా కారును తయారుచేశారు. టైర్లు దెబ్బతిన్నప్పటికీ కారు రన్నింగ్ ఆగదు. పేలుళ్లను తట్టుకునే విధంగా ఫ్యూయల్ ట్యాంకు ఉంటుంది. 6 నుంచి 9 సెకండ్లలో 0-100 వేగాన్ని అందుకోగల ఈ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు.
పుతిన్ ఇల్యుషిన్ ఐఎల్-96-300పీయూ విమానంలో ప్రయాణిస్తారు. దీనిని ఫ్లైయింగ్ క్రెమ్లిన్ అని పిలుస్తారు. ఏకబిగిన ఆగకుండా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రపంచవ్యాప్తంగా సైనిక, నిఘా, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా సంప్రదించ గల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. క్షిపణి దాడి జరిగితే దాన్ని తిప్పికొట్టగల వ్యవస్థ ఇందులో ఉంది. రాడార్ జామింగ్ చేసే టెక్నాలజీ కూడా దీని ప్రత్యేకత.

Vladimir Putin 01
అత్యవసర పరిస్థితులలో అణ్వస్త్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా కూడా ఇది పనిచేస్తుంది. అధ్యక్షుడి సంచార నివాసంగా ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. బెడ్రూముతోపాటు ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, అధ్యక్షుడి కోసం ప్రైవేట్ ఆఫీసు, వర్క్‌స్పేస్ ఉంది. అధికారులు, అతిథుల కోసం గెస్ట్ లాంజ్/సలూన్ ఉంది. విలాసవంతమైన బాత్రూములు, కిచెన్, డైనింగ్ ఏరియాలు కూడా ఉన్నాయి. వైద్య సౌకర్యాల కోసం మెడికల్ కంపార్ట్మెంట్, జిమ్ స్పేస్ ఉన్నాయి. విమానంలోని అలంకరణలన్నిటికీ బంగారు తాపడం ఉంటుంది.
ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసు(ఎఫ్ఎస్ఓ)కు చెందిన అధికారులే పుతిన్ అంగరక్షకులుగా వ్యవహరిస్తారు. వీరు గాక ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసు(ఎస్బీపీ) గార్డులు కూడా అన్నివేళలా రక్షణ కల్పిస్తారు. అభ్యర్థులను అత్యంత కఠినమైన పాలిగ్రాఫ్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, విస్తృత బ్యాక్‌గ్రౌండ్ తనిఖీల అనంతరమే భద్రతాధికారులుగా ఎంపికచేస్తారు. 5.8-6.2 మధ్య ఎత్తు, 75-90 కిలోల బరువు ఉండి, విదేశీ భాషలు మాట్లాడ గల పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారి శారీరక దారుఢ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 35 ఏళ్లకే రిటైర్ చేస్తారు.
అధ్యక్షుడి విదేశీ పర్యటనకు ముందుగానే ఆయన పర్యటించనున్న దేశాన్ని ఎస్బీపీ అధికారులు సందర్శించి అధ్యక్షుడు బసచేసే హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అక్కడ అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థను అధ్యక్షుడు ఎట్టి పరిస్థితిలో ఉపయోగించరు. తమ వెంట తెచ్చిన సంచార టెలిఫోన్ బూత్ ఎస్బీపీ అధికారులు హోటల్ గదిలో అమరుస్తారు. పుతిన్ మొబైల్ ఫోన్ వాడరు కాబట్టి ఈ టెలిఫోన్ ద్వారానే కమ్యూనికేషన్ సాగిస్తారు.
అధ్యక్షుడు తినే ఆహారం విషపూరితం కాదని ధ్రువీకరించుకోవడానికి మొబైల్ ఫుడ్ ల్యాబొరేటరీ కూడా మాస్కో నుంచి వస్తుంది. హోటల్లో వండే ఏ ఆహారాన్ని పుతిన్ భుజించరు. మంచినీరు కూడా ఇక్కడిది సేవించరు. పుతిన్‌కు ప్రత్యేకంగా వండిపెట్టేందుకు మాస్కో నుంచి ప్రత్యేక సిబ్బంది వస్తారు.
విదేశీ పర్యటనల సందర్భంగా పుతిన్ ఉపయోగించే టాయ్‌లెట్, బాత్రూము, టెలిఫోన్ బూత్ వంటివి ప్రత్యేకంగా మాస్కో నుంచి రవాణా అవుతాయి. భద్రతలో భాగంగా అధ్యక్షుడు విసర్జించే మలమూత్రాలను సేకరించి సీల్డ్ కంటెయినర్లో వాటిని భద్రతపరిచి మాస్కోకు తరలిస్తారన్న విషయం మొట్టమొదటిసారి 2022లో పారిస్ జర్నలిస్టులు బయటపెట్టారు. పుతిన్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఆ విదేశీ సంస్థలు ఆయన మలాన్ని పరీక్షించేందుకు అవకాశం ఇవ్వకుండా వాటిని సేకరించి వాపసు తీసుకువెళతారు.