ముంబై: దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో గురువారం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌తోసహా ఇతర విమానాశ్రయాలలో 550కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. నిర్వహణా సమస్యలు చుట్టుముట్టడంతో ఇండిగో విమాన సర్వీసులకు వరుసగా మూడవ రోజు కూడా అంతరాయం ఏర్పడడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక విమానాశ్రయాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగో సంక్షోభంపై చర్చించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గురువారం ఇండిగో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోపక్క దీనిపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతున్నది. అయితే దర్యాప్తు గురించి తమకు తెలియదని ఇండిగో తెలిపింది.
గత నెలలో ఇండిగోకు చెందిన 1,232 విమాన సర్వీసులు రద్దు కాగా గణనీయ స్థాయిలో జాప్యం ఏర్పడింది. ప్రతిరోజూ దాదాపు 2,300 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపే ఇండిగో గడిచిన రెండు రోజులుగా విమాన సర్వీసులకు ఏర్పడిన తీవ్ర అంతరాయంపై స్పందిస్తూ ఊహించని సమస్యలు తలెత్తాయని పేర్కొంది. వివిధ విమానాశ్రయాలలోని పార్కింగ్ ప్రదేశాలను ఇండిగో విమానాలు ఆక్రమించుకోవడంతో ఇతర ఎయిర్‌లైన్స్ నడిపే విమానాలు జాప్యాన్ని ఎదుర్కోవలసి వస్తున్నది.
ఇండిగో విమానాల రద్దు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విమానాల రద్దుతో మంగళవారం రాత్రి నుంచి సుమారు 1000 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరుసటి రోజు సాయంత్రం వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ తీరును భారతీయ పైలట్ల సమాఖ్య (ఎఫ్ఐపీ) తీవ్రంగా విమర్శించింది. సిబ్బంది నియామకాలను నిలిపేసిందని, మార్కెట్‌ను నియంత్రించే విధంగా ప్రవర్తిస్తున్నదని ఆరోపించింది. ఈ మేరకు ఎఫ్ఐపీ బుధవారం రాత్రి డీజీసీఏకి ఓ లేఖను పంపింది. తగినంత మంది సిబ్బంది ఉన్నట్లు ఆధారాలను చూపించలేకపోతే, సీజనల్ ఫ్లైట్ షెడ్యూల్స్‌ను ఆమోదించకుండా, నిలిపి ఉంచాలని డీజీసీఏని కోరింది. .
విమాన ప్రయాణికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయామని ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో పీటర్ ఎల్బర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇండిగో విమానాల రద్దు, జాప్యాల నేపథ్యంలో ఆయన తన సంస్థలోని సిబ్బందికి ఓ ఈ-మెయిల్‌ను పంపించారు.
పైలట్ల విశ్రాంతి, డ్యూటీ నిబంధనల నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇండిగో కోరింది. ఏ320 విమానాల నైట్ డ్యూటీ సేవలకు ఈ మినహాయింపునివ్వాలని కోరింది. కొత్త నిబంధనల ప్రకారం సిబ్బంది అవసరాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలిపింది. ప్రణాళికాలోపాల వల్ల తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేరని చెప్పింది.