(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణులుగా పిలిచే ఆరావళి ఆగమవుతున్నది. దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో గడిచిన కొన్నేండ్లుగా జరుగుతున్న మైనింగ్, మానవ కార్యకలాపాలు ఇప్పటికే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అక్రమాలను అడ్డుకోవాల్సిన కేంద్రప్రభుత్వం.. దాన్ని వదిలేసి ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా విపక్ష నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆరావళిపై ఇప్పుడు పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్ వరకూ ఆరావళి పర్వతాలు విస్తరించాయి. అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు, ప్రసిద్ధ కోటలు, దేవాలయాలతో పాటు జింక్, రాగి, క్వార్జ్, సీసం, పాలరాయి, రాక్సల్ఫేట్ వంటి అరుదైన ఖనిజాలకు ఈ పర్వతాలు పెట్టింది పేరు. దీంతో గడిచిన కొన్నేండ్లుగా ఇక్కడ మైనింగ్ మాఫియా పెచ్చరిల్లుతున్నది. ఆరావళి పర్వతాలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్ని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆరావళి పరిధిని మారుస్తూ కేంద్రం ఆధీనంలోని పర్యావరణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు ఇటీవల ఓ నివేదికను ఇచ్చింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను ఆరావళి పరిధి నుంచి మినహాయించాలని, మైనింగ్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్రం అందులో పేర్కొంది. దీనికి ఆమోదం తెలిపిన సుప్రీం.. సైంటిఫిక్ మ్యాపింగ్ పూర్తయ్యే వరకూ కొత్త లీజులు ఇవ్వొద్దని వెల్లడించింది.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం.. ఆరావళిలోని మొత్తం 12,081 పర్వతాల్లో కేవలం 1,048 పర్వతాలు మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కేంద్రం తాజాగా తెచ్చిన ప్రతిపాదనల ప్రకారం.. ఆరావళి పర్వతాల్లో 90 శాతం ప్రాంతం ఇకపై మైనింగ్ పరిధిలోకి వచ్చినట్టేనని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1975-2019 వరకూ జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా ఇప్పటికే 8 శాతం మేర ఆరావళి పర్వతాలు కనుమరుగయ్యాయని, ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో ఆరావళి అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరావళికి ప్రమాదం ఏర్పడితే, ఢిల్లీ లాంటి నగరాలకు విపత్తులు పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.