Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) బుధవారం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది (Uniform Civil Code bill into law). ఇప్పటికే యూసీసీ బిల్లును ఆమోదించిన ఏకైక రాష్ట్రంగా నిలిచిన ఉత్తరాఖండ్.. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా కూడా నిలిచింది. ఇక పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.
యూసీసీ బిల్లులోని అంశాలు..
వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితో పాటు సహ జీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను యూసీసీ బిల్లులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది.
ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు సహజీవనానికి ఆమోదం తెలుపుతూనే జంటల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. సహజీవనం చేస్తున్న, చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారికి ఆరు నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. ఇక 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు.
తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే.. వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చినా.. వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాల్సి ఉంటుంది.
రెండేళ్ల కసరత్తు తర్వాత..
2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీని ప్రముఖంగా పేర్కొంది. అధికారంలోకి రాగానే సీఎం సుష్కర్సింగ్ ధామీ.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండుళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. 70కిపైగా సమావేశాలు నిర్వహించి 60 వేల మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2.33 లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించిన ఇటీవలే సీఎంకు సమర్పించింది. ఈ ముసాయిదా బిల్లును సీఎం ధామీ గత నెల రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. ఆమోదం లభించింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చింది.
Also Read..
Baraat | కారు టాప్‌పై నిల్చొని పెళ్లి మండపానికి వరుడు.. షాకిచ్చిన పోలీసులు
Mallikarjun Kharge | ఇప్పుడు నాకు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం : మల్లికార్జున ఖర్గే
Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు