తెలంగాణ 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నది. అప్పుడు తెలంగాణ వార్షిక ఆదాయం రూ.120 కోట్లు. ఆ సమయంలో రూ.22 కోట్ల వార్షిక ఆదాయంతో ఉన్న ఆంధ్ర రాష్ర్టాన్ని తెలంగాణతో కలిపితే ఏమవుతుందని ఫజల్ అలీ కమిషన్ నివేదికలో చెప్పారో సరిగ్గా అదే జరిగింది. 1956 నవంబర్‌లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే, మార్చిలో బడ్జెట్ రూపొందించినప్పుడు నిజాం రూపొందించిన ప్రాజెక్టుకు తెలంగాణ మిగులు నిధులు రూ.67 కోట్లలో నుంచి రూ.12 కోట్లను కేటాయించాలని తెలంగాణ శాసనసభ్యులు అడిగితే డబ్బెక్కడిది? ఉన్న కాస్తా ఖర్చయిపోయింది అని చెప్పారు అప్పటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి. అప్పటికే అంటే 5 నెలల కాలంలో కేంద్రానికి వారు పడ్డ రూ.12 కోట్ల అప్పు తీర్చారో, ప్రకాశం బరాజ్, ధవళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేశారో, వ్యక్తిగత ఖాతాల్లో జమ చేశారో తెలియదు కానీ, కోట్ల రూపాయల మిగులు నిధులు మాంత్రికుల చేతిలో ఛూమంత్రకాళీ అన్నట్టుగా మాయమయ్యాయి.
తెలంగాణకు చెందిన చెన్నారెడ్డి లాంటి నాయకులు పట్టుకున్న పద్దుల ప్రకారం ఏ ప్రాంతం అభివృద్ధి కోసం చేసిన ఖర్చు, ఏ ప్రాంతం ఇచ్చే పింఛన్లు ఆ ప్రాంతానికొచ్చే ఆదాయంలో నుంచి ఖర్చు పెట్టాలన్నది విలీన నిబంధన. కానీ 1957-58 బడ్జెట్లోనే ఆంధ్ర ప్రాంతంలో రూ.34 కోట్ల ఖర్చుకు బదులుగా రూ.37 కోట్లు ఖర్చు పెట్టారని, తెలంగాణలో ఖర్చు పెట్టాల్సిన రూ.23 కోట్లకు బదులుగా రూ.18 కోట్లు మాత్రమే ఖర్చు చేశారనీ చెన్నారెడ్డి శాసనసభకు చూపించారు. అసలు రూ.37 కోట్లు, రూ.23 కోట్లు కూడా బహుశా తెలంగాణ మిగులు నిధులు రూ.60 కోట్లు అయి ఉంటాయని కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు లేకపోతే రూ.22 కోట్ల ఆదాయం ఆంధ్రా వారి ఖర్చులకే సరిపోనప్పుడు, పై రూ.37 కోట్లు ఒక్క సంవత్సరంలో ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఈ పరిస్థితి సరిగ్గా అంచనా వేసిన ఫజల్ అలీని చాలా అభినందించాల్సిందే. తెలంగాణ పట్ల కాంగ్రెస్ చేసిన తప్పుల చిట్టాను క్రితం వారాల్లోని వ్యాసాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరిన్ని పరిశీలిద్దాం.
29. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం, పదోన్నతులు, వేతనాల సవరణ, బదిలీలు, విధుల నిర్వహణలో తెలంగాణ ప్రాంతానికి జరిగినంత అన్యాయం బహుశా దేశంలోని ఏ ఇతర రాష్ర్టానికి జరిగి ఉండకపోవొచ్చు. ఇష్టం వచ్చినప్పుడల్లా రాజోలిబండ గేట్లు పగులగొట్టి తమ ప్రాంతానికి నీళ్లు పారించుకున్నట్టుగానే ఆంధ్రా పాలకులు తెలంగాణ నిబంధనల గేట్లు ఎత్తివేసి, వేలు, లక్షల ఉద్యోగాలను కొల్లగొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రా నాయకులనే ముఖ్యమంత్రులుగా నియమించింది. ఇది 29వ తప్పు.
30. నిబంధనల ప్రకారం తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. కానీ ఆ నిబంధనలకు ముఖ్యమంత్రి కాగానే రెండోరోజే తిలోదకాలు ఇచ్చారు సంజీవరెడ్డి. ఇది 30వ తప్పు. పైగా తెలంగాణ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి సహా సభ్యులుగా ఉండాల్సిన రీజినల్ కౌన్సిల్‌ను కుదించి ఒక కమిటీగా చేసి, తెలంగాణ అన్న పదం తీసివేసి, తెలంగాణ సెటిలర్స్‌ను తెలంగాణ వారిలో విశాలాంధ్ర మద్దతుదారులను ఆ కమిటీలో సభ్యులుగా నియమించారు. తద్వారా తెలంగాణ భూముల కొనుగోళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, నిధుల విషయంలో తన మాటే చెల్లుబాటు అయ్యేటట్టు చేసుకున్నారు నీలం సంజీవరెడ్డి. నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిసినా పట్టించుకోని నెహ్రూ, తెలంగాణకు జరిగిన అన్యాయంలో మొదటి ముద్దాయి.
31. ఉద్యోగ రంగంలో ఆంధ్రా వారిని ఉన్నత ఉద్యోగాల్లో నియమించేసరికి తెలంగాణ ఉద్యోగులు చాలా వేధింపులకు, వివక్షకు గురయ్యారు. అన్యాయాలు ఈ విధంగా కొనసాగుతూ వచ్చాయి.
32. ముల్కీ నిబంధనలను ఎక్కడా అమలు కాలేదు. వాటిని ఆంధ్రాపాలకులు పూర్తిగా తోసిపుచ్చారు.
33. ఉపాధ్యాయ ఉద్యోగాల్లో స్థానికేతరులనే ఎక్కువశాతం నియమించడం.
34. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్‌ను రద్దు చేసి, ఆంధ్ర ప్రాంత నిబంధనలను అమలు చేయడం. దీని వల్ల నిజాం ప్రదభుత్వంలో అధిక వేతనాలు పొందిన వారిజీతాలు తగ్గి, వారు నష్టపోయారు.
35. నిబంధనల్లో ఉన్న నిష్పత్తిని పాటించకుండా 1961 వరకు అన్ని ఉద్యోగాలను వలస పాలకులు ఆంధ్ర వారికే కట్టబెట్టారు.
36. తెలంగాణలో ఉన్న 500 సాంకేతిక ఉద్యోగాల్లో తెలంగాణ వారిని కేవలం 327 ఖాళీల్లో నింపి, మిగతా వాటిలో ఆంధ్రా వారిని నియమించారు. అదే ఆంధ్ర ప్రాంతంలో 1000 ఖాళీలుండగా, 1751 మందిని ఆంధ్రలో నియమించారు. ఈ అన్యాయాలన్నింటిపై కేసులు వేసి కోర్టులో గెలిచినా, ఆ తీర్పులను ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదు.
37. సహకార శాఖలో స్థానికులను పక్కనపెట్టి, వారి సీనియారిటీని విస్మరించి, 400 మంది నాన్ గెజిటెడ్ ఆంధ్ర ఉద్యోగులను రప్పించి, గెజిటెడ్ అధికారులుగా ఆ ఖాళీలను నింపారు.
38. ఇక ఈ వివక్షతో అన్ని శాఖల్లో తెలంగాణ వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో ఉన్న 70 డిప్యూటీ రిజిస్ట్రార్ పదవుల్లో కేవలం 9 మంది తెలంగాణ వారు ఉన్నారు. పంచాయతీరాజ్‌శాఖలో తొమ్మిది జిల్లాల్లో తెలంగాణకు చెందిన ఒక్కరు కూడా అధికారిగా లేరు. అటవీశాఖలో తెలంగాణ వారిని, వారి సీనియారిటీని పూర్తిగా పక్కనపెట్టి ఆంధ్ర అధికారులకు మాత్రమే ప్రమోషన్లు కల్పించింది. వలస పాలకులను ప్రశ్నించిన వారికి వేధింపులే మిగిలాయి. ఆంధ్ర ప్రాంతంలో తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చి, తెలంగాణ తహసీల్దార్లకు మాత్రం ఆ పదోన్నతులను వర్తింపజేయలేదు. మున్సిపల్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ శాఖల్లో కూడా ప్రమోషన్ల విషయంలో ఇటువంటి వివక్షను నిరాటంకంగా సాగించారు.
39. హైదరాబాద్ రాష్ట్రంలో ఇచ్చిన స్కేల్ ప్రకారం మంచి వేతనాలు అందుకున్న స్థానిక ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక నష్టాల పాలయ్యారు. ఇక్కడ ఉన్న స్కేల్ వీరికి ఇచ్చి, కొత్తగా నిర్ణయించిన జీతాలు ఆంధ్ర వారికి ఇవ్వాల్సి ఉండగా, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జీతాలు కూడా తక్కువ స్కేలుకు దింపి, ఎనలేని కష్టాలు కల్పించారు.
ఇలాంటి అనుభవాల తర్వాత ప్రాంతాల ఆదాయం ఎలా ఖర్చు చేయాలన్న విషయంపై తెలంగాణ రీజినల్ కమిటీ ఓ విధానాన్ని రూపొందించింది.
1. భూమి శిస్తు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అటవీ శాఖ, వాహనాలపై పన్ను, అమ్మకపు పన్ను, సాధారణ పరిపాలన, న్యాయ శాఖ, జైళ్లు, పోలీసులు, విద్య, వైద్యం, ప్రజారోగ్యం, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, కమ్యూనిటీ అభివృద్ధి, విద్యుచ్ఛక్తి, మొదలైన శాఖలు, రంగాల్లో ప్రాంతాల ఆదాయం, ఖర్చు ఆయా ప్రాంతాలకే ఉండాలి.
2. హైదరాబాద్‌లో అయ్యే ఖర్చు కూడా స్థానికంగా ఉండాలి.
3. మిగతా రాష్ర్టానికి పెట్టే ఖర్చు, కామన్ సర్వీసెస్‌కు అయ్యే ఖర్చు 2:1 నిష్పత్తిలో ఉండాలి. అప్పుడు తెలంగాణ జనాభా తక్కువగా ఉండేది. ఆంధ్ర నాయకుల్లో ఒక్క పుచ్చలపల్లి సుందరయ్య మాత్రమే 1961లో తెలంగాణ ఆదాయం.. ఆంధ్రకు ఖర్చు పెడుతున్నారని పాలకులను విమర్శించారు.
తెలంగాణ ఆదాయం కనీసం తెలంగాణకైనా ఖర్చు పెట్టడంలేదు. 1961లో ప్రణాళిక ప్రకారం రూ.305 కోట్లు ఆదాయం. అందులో ఆంధ్రకు రూ.200 కోట్లు, తెలంగాణకు రూ.105 కోట్లు ప్రభుత్వం ఖర్చును పేర్కొన్నది. కానీ, అది అన్యాయం. ప్రాంతాల వారీగా ఆదాయం విడివిడిగా చూసినా రూ.200 కోట్లు తెలంగాణకు ఖర్చు పెట్టి, రూ.105 కోట్లు ఆంధ్రకు ఖర్చు పెట్టినా, ఇంకా తెలంగాణకు మిగులు నిధులను ఆంధ్రా వాడుకున్నట్టే అని 1961లో గవర్నర్ ప్రసంగం తర్వాత తన ప్రసంగంలో సుందరయ్య తప్పుబట్టారు. అంతవరకు ఏటా జరుగుతున్న అన్యాయాల గురించి గట్టిగా వాదించారు. అటువంటి దోపిడీ పర్యవసానం గురించి ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలని కూడా సలహా ఇచ్చారు సుందరయ్య.
తెలంగాణ నాయకుడు రావి నారాయణరెడ్డి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 1956 నుంచి 1961 వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.21 కోట్ల మిగులు నిధులున్నాయనీ, వాటితో గ్రామాల్ని విద్యుదీకరణ చేయాలని కోరారు. తెలంగాణ మిగులు నిధులను వలస పాలకులు ఆంధ్రలో ఖర్చు చేసి, ఇక్కడ అభివృద్ధికి ఖాళీ ఖజానా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. విశాలాంధ్రను సమర్థించిన ఆయన తర్వాతి రోజుల్లో అట్లా సమర్థించినందుకు పశ్చాత్తాపపడ్డారు. ఈ రకంగా శాసనసభలో కొందరు గట్టిగా వాదించినా దున్నపోతు మీద వాన కురిసిన చందంగా కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా వలస పాలకులు ప్రవర్తించారు. అప్పట్లో అనధికారికంగా చక్కర్లు కొట్టిన ఒక వార్త గురించి ఇక్కడ చెప్పుకోవాలి. 1982లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయే ముందు తన కుమారుడిని పిలిచి ఒక సూట్‌కేస్ ఇచ్చి, అనంతపురంలో ఉండే తన స్నేహితుడికి ఇవ్వాలని చెప్పారంట. అందులో దాదాపు రూ.42 కోట్లు ఉన్నాయనేది అప్పట్లో ప్రచారం జరిగింది. సంజీవరెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు… తన తండ్రి స్నేహితుడి దగ్గరకు వెళ్లి సూట్ కేస్ గురించి అడిగితే ‘ఏ సూట్‌కేస్? నాకేం తెలియదు?’ అని అన్నారంట. కర్మ ఎవరినీ వదలదు కదా!
ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇదే సంజీవరెడ్డి 1977 నుంచి 1982 వరకు రాష్ట్రపతి పదవి అలంకరించారు. తన మాట వినే వ్యక్తి కావాలని ఇందిరాగాంధీ ఆయనను ఎన్నుకున్నారనే అభిప్రాయం ఉన్నది. అలా 1956 నుంచి 1982 వరకు చేసే అవినీతి పనులన్నీ అయిపోయాక ఒక పుస్తకం రాశారు.. అందులో పలు నీతి ప్రవచనాలు చెప్పుకొచ్చారు. భయం, పక్షపాత ధోరణి లేకుండా ఒక రాష్ట్రపతి ఎలా ప్రవర్తించాలి అనే అంశం పలు వివరాలను రాశారు. నీతులు ఉన్నది చెప్పటానికే కదా!