Pregnant Woman | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. రైల్లో గర్భిణి (Pregnant Woman)పై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా కదులుతున్న రైలు (Moving Train) నుంచి ఆమెను బయటకు తోసేశాడు. ఈ ఘటన గురువారం ఉదయం కోయంబత్తూరు (Coimbatore) నుంచి తిరుపతికి వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 36 ఏళ్ల మహిళ తమిళనాడు తిరుప్పూర్ నుంచి చిత్తూరుకు కోయంబత్తూర్ – తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో (Coimbatore-Tirupati Intercity Express train) ప్రయాణిస్తోంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. ఉదయం 6:40 గంటలకి రైలు ఎక్కి లేడీస్ కోచ్‌లో కూర్చుంది. ఆ సమయంలో మరో ఏడుగురు మహిళలు కూడా అందులో ఉన్నారు. రైలు 10:15 గంటలకు జోలార్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే లేడీస్ కోచ్‌లోని ఇతర మహిళలంతా దిగిపోయారు. ఇక జోలార్‌పేట స్టేషన్లో రైలు కదులుతుండగా.. హేమరాజ్ (27) అనే యువకుడు లేడీస్ కోచ్‌లోకి ఎక్కాడు. అందులో మహిళ ఒక్కటే ఉండటాన్ని గమనించిన అతడు.. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అయితే, మహిళ ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన హేమరాజ్ సదరు మహిళను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు.
ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె చేతులకు, కాళ్లకు, తలకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జోలార్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.
Also Read..
Nitin Gadkari | టోల్ ఛార్జీలపై ఉపశమనం..? నితిన్ గడ్కరీ ఏమన్నారంటే..?
Ratan Tata | రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి పేరు.. ఇంతకీ ఎవరీ మిస్టరీ మ్యాన్..?