Prashant Kishor : అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటనపై జన్ సురాజ్ చీఫ్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఏ సమయంలో ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కొద్ది నెలల కిందట కుల గణనకు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారని గుర్తుచేశారు. అయితే అమెరికా పర్యటనలో రాహుల్ ప్రస్తుతం రిజర్వేషన్లు తొలగించడం గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకూ రాహుల్ నిత్యం కుల గణన చేపట్టాలని, అవసరమైతే కోటా పరిమితిని పెంచాలని అన్నారని, ఇప్పుడాయన ఎందుకు రిజర్వేషన్లు తొలగించాలని మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ దినేష్ శర్మ గురువారం స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ఎకానమీ ప్రపంచంలో 11వ స్ధానంలో ఉండగా ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఎకానమీగా ఎదిగిందని అన్నారు.
త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్ ప్రస్తుతం ఆయుధాలు తయారుచేస్తోందని, భారత్ ఎడ్యుకేషన్ హబ్‌గా ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విద్యార్ధులు ఇక్కడికి చదువుకునేందుకు వస్తున్నారని శర్మ వివరించారు. మనం సొంతంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారుచేశామని ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేశామని గుర్తుచేశారు. భారత్ పలు రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశీ పర్యటనల సందర్భంగా తన అసహనం వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.
Read More :
Mahesh Babu | ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీ.. మరో బిజినెస్‌లోకి మహేశ్ బాబు.. !