న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనాభా, కుల గణన రెండు దశల్లో జరుగనున్నది. (Population, caste census) చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2027 మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా జనాభా గణనతో పాటు కుల గణన కూడా ప్రారంభంకానున్నది. అయితే జమ్ముకశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా, సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జాతీయ గణన నిర్వహించి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను అప్డేట్ చేస్తారు. 2011లో జరిగిన చివరి జనాభా గణనలో దేశ జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. గత పదేళ్లలో జనాభా 17.7 శాతం మేర పెరిగింది.
మరోవైపు షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేపట్టాల్సి ఉన్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. తాజా జనాభా గణనలో కుల గణనను కూడా చేర్చడానికి రాజకీయ వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లో ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా జనాభా గణనతోపాటు కుల సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
Also Read: