భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో భారీ పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. (Police Recruitment Scam) పలువురి అభ్యర్థుల ఆధార్ ఫొటోలను మార్చు చేసి నకిలీ వ్యక్తులు పరీక్ష రాశారు. పరీక్షలో పాసైన తర్వాత అసలు అభ్యర్థులు తమ ఫొటోలను తిరిగి మార్చుకున్నారు. ఈ స్కామ్‌పై దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. 7,411 పోస్టుల భర్తీ కోసం 2023లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష జరిగింది. 2024 మార్చిలో ఫలితాలు ప్రకటించగా 58,000 మంది అభ్యర్థులు పరీక్ష క్లియర్ చేశారు. గత ఏడాది నవంబర్ నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. చివరకు 7,411 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.
కాగా, గత ఏడాది అక్టోబర్‌లో మోరెనా జిల్లాలో జరిగిన ఫిజికల్ టెస్ట్ సందర్భంగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొంత మంది అభ్యర్థుల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ డేటా, ఫొటోలు పలుసార్లు మారినట్లు ఒక పోలీస్ అధికారి గమనించారు. దీనిపై దర్యాప్తు జరుపగా అసలుగుట్టు రట్టయ్యింది. అభ్యర్థులకు బదులుగా నకిలీ వ్యక్తులు పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసినట్లు బయటపడింది.
మరోవైపు రాత పరీక్షకు ముందు చాలా మంది అభ్యర్థులు తమ ఆధార్ ఫొటోలు, వేలిముద్రలను ప్రాక్సీ అభ్యర్థుల డేటాతో మార్పు చేశారు. దీంతో వారి స్థానంలో నకిలీ అభ్యర్థులు పరీక్ష రాశారు. ఫలితాలు వచ్చిన తర్వాత పాసైన అభ్యర్థులు వారి నిజమైన గుర్తింపు కోసం ఆధార్‌ను మళ్ళీ అప్డేట్ చేశారు. ఫిజికల్ పరీక్షకు అసలు అభ్యర్థులు స్వయంగా హాజరైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, మోరెనా, షియోపూర్, శివపురి, షాడోల్, అలీరాజ్పూర్తో సహా పలు జిల్లాల్లో ఈ స్కామ్ జరిగినట్లు బయటపడింది. భితర్వార్, మోరెనా, షియోపూర్‌లోని ఆధార్ కేంద్రాల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తెలిసింది. ఆరుగురు అభ్యర్థుల తరపున ఒకే వ్యక్తి పరీక్షలు రాయగా వారిలో ఐదుగురు క్లియర్ అయ్యారని నిర్ధారణ అయ్యింది.
మరోవైపు ఈ రాకెట్ నిర్వాహకులు ప్రతి అభ్యర్థి నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మొత్తం డీల్ రూ.15 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అభ్యర్థులు, నకిలీ అభ్యర్థులు, వారిని సమకూర్చిన వారు, ఆధార్ సెంటర్ ఆపరేటర్లతో సహా ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో వంద మందిపై దర్యాప్తు కొనసాగుతున్నదని అన్నారు. ఈ రాకెట్ మూలాలు బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: